BJP Manifesto In Chhattisgarh :ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రజలపై బీజేపీ వరాలు జల్లు కురిపించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే క్వింటా ధాన్యాన్ని రూ.3,100కు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. 'మోదీ కీ గ్యారెంటీ 2023' పేరుతో బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా మ్యానిఫెస్టోను రాయ్‌పుర్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వస్తే వివాహిత మహిళలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం చేస్తామని అమిత్ షా తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ ఇస్తామని పేర్కొన్నారు.
'కాంగ్రెస్ ప్రీ-పెయిడ్ సీఎం బఘేల్'
Amit Shah On Congress : అంతకుముందు పండరియా నియోజకవర్గంలో జరిగిన ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను.. కాంగ్రెస్ 'ప్రీ-పెయిడ్ సీఎం'గా అభివర్ణించారు. బఘేల్ టాక్ టైమ్ చెల్లుబాటు ముగిసిందని షా ఎద్దేవా చేశారు. "మీరు ఓటు ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి వేయవద్దు. ఛత్తీస్‌గఢ్ భవిష్యత్త్ కోసం ఓటేయండి. మీ ఓటు నక్సలిజాన్ని అంతం చేసి ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రదేశంగా మార్చాలి. సీఎం భూపేశ్ బఘేల్ రాష్ట్ర ప్రజలను లూటీ చేస్తున్నారు. తాను రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకునే వ్యక్తి రాష్ట్రానికి మేలు చేయలేరు. అందుకే బఘేల్‌ను నేను కాంగ్రెస్‌కు 'ప్రీ పెయిడ్ సీఎం' అని అంటున్నాను." అని షా విమర్శించారు.