అసోంలో అధికార భాజపా మాఫియాలా తయారైందని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. రాష్ట్రంలో సిండికేట్లను నడుపుతోందని విమర్శించారు. భాజపాలో రెండు వర్గాలున్నాయని, రెండూ ప్రజలను మోసం చేశాయని అసోం సరుపతర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తారు.
"అసోం ప్రభుత్వంలో ఓ శకుని మామ, మరో ధృతరాష్ట్రుడు ఉన్నారు. భాజపా సహా ఇద్దరూ అసోంలో ప్రజలను దగా చేశారు. ప్రజానాయకుడిగా పేరున్న ధృతరాష్ట్రుడు 6 సంప్రదాయ జాతులను షెడ్యూల్ తెగల్లో కలుపుతానని వంచన చేశారు. ఇక శకుని మామ.. కేవలం ప్రజలను మోసం చేసే అవినీతి సర్కారును నడిపిస్తున్నారు."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి
సొంత ముఖ్యమంత్రిపైనే భాజపాకు గౌరవం లేదన్నారు ప్రియాంక. అందుకే ఇప్పటివరకు సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేదని విమర్శించారు. పార్టీ(భాజపా)లోనే ఐక్యత, స్థిరత్వం లేకపోతే రాష్ట్రంలో ఎలా సాధిస్తారని ప్రశ్నించారు.