తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2024లో మాదే విజయం.. నైరాశ్యంలో విపక్షాలు.. అందుకే నాకు సమాధి కడతామని వ్యాఖ్యలు'

2024లో ఎన్నికల్లో బీజేపీని ఎవరూ ఓడించలేరని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ 44వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.

bjp foundation day 2023
bjp foundation day 2023

By

Published : Apr 6, 2023, 1:05 PM IST

అవినీతి, బంధుప్రీతి, శాంతిభద్రతల సమస్యపై పోరాటం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతిపక్షాలు బాద్‌షాహీ ధోరణితో పేదలు, బలహీన వర్గాల ప్రజలను అణిచివేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ అస్తిత్వం కోసం పోరాడుతున్న కొన్ని పార్టీలు.. బీజేపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూనే ఉన్నాయంటూ కాంగ్రెస్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీ 44వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. భక్తి, బలం, సాహసాలతో గౌరవం పొందిన హనుమాన్‌ నుంచి భాజపా స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. హనుమాన్‌ మాదిరిగా సవాళ్లపై పోరాటం చేయడమే కాకుండా దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

"బీజేపీకి.. హనుమాన్‌ ద్వారా మరో ప్రేరణ లభిస్తుంది. రాక్షసులను ఎదుర్కోవటానికి హనుమంతుడు కఠినంగా మారారు. అదే విధంగా అవినీతి, బంధుప్రీతి, శాంతిభద్రతల సమస్యపై అదే విధమైన సంకల్పంతో సామాజిక రుగ్మతల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తోంది. హనుమాన్‌ జీవితమంతా చూస్తే.. ఆయనకు విజయాలను అందించటంలో "కెన్‌ డూ" (నేను చేయగలను) వైఖరి ముఖ్యపాత్ర పోషించింది. హనుమాన్​ అందరి శ్రేయస్సు కోసం పని చేశారు. తన కోసం ఏదీ చేసుకోలేదు. దీనినే ప్రతి బీజేపీ కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలి."

--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు విశాల దృక్పథంలో ఆలోచించలేకపోతున్నాయని.. వారిది సంకుచిత మనస్తత్వమని విమర్శించారు. "వారు చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటితోనే సంతృప్తి చెందుతున్నారు. బీజేపీ పెద్ద కలలు కనడమే కాకుండా వాటిని నెరవేర్చుతోంది. 2014లో మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారు పేదలు, అణగారిన వర్గాలు, అణచివేస్తూనే ఉన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు అవుతుందని వారు కనీసం ఊహించలేదనుకుంటా. బీజేపీ సాధిస్తున్న వృద్ధిని చూసి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వారు మరింత నిరాశకు లోనవుతున్నారు. అందుకే ఏం చేయాలో అర్థం కాక నాకు సమాధి కడతామని బహిరంగంగానే చెబుతున్నారు" అంటూ దుయ్యబట్టారు. తమది కుటుంబ పార్టీ కాదని.. బీజేపీకి పార్టీ కంటే దేశమే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ అని.. 2024లో ఎన్నికల్లో తమని ఎవరూ ఓడించలేరని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :'చేతగానివారిలా ఉంటేనే ఆ పార్టీలో చోటు'.. కాంగ్రెస్​పై ఆజాద్​ ఫైర్

ప్రియురాలిని చంపిన ప్రియుడు.. 10 అడుగుల గోతిలో పాతిపెట్టి..

ABOUT THE AUTHOR

...view details