Biporjoy Cyclone Status : అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలిసారి ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను.. అతి తీవ్రంగా మారి గుజరాత్ వైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను మరో 36 గంటల్లో మరింత బలపడి.. గుజరాత్‌లోని కచ్, పాకిస్తాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటనుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గుజరాత్‌తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలుండ్చొని అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో.. అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి. కాగా బిపోర్‌జాయ్ తుపానుపై.. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన బిపోర్ జాయ్ తుపాను.. గంటకు ఎనిమిది కి.మీల వేగంతో ఈశాన్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో.. గంటకు 135 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎమ్‌డీ అంచనా వేసింది. గుజరాత్ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా కారణంగా జూన్ 15 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వారు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 1,300 మంది తరలించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా మహారాష్ట్రలోని ఠానే, రాయగఢ్, ముంబయి, పాల్ఘర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45-55 కి.మీ వేగంతో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ వివరించింది.