Bipin Rawat helicopter accident హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్.. ఆపన్నుల పాలిట అమృతమూర్తిగా పేరు పొందారు. భారత సైన్యంలో సేవా కార్యక్రమాలకు ఆమె ప్రతిరూపంగా నిలిచారు. సైనికుల సతీమణుల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. సైనిక కుటుంబాల బాగోగులు చూడటం దీని ప్రధాన విధి.
పోరాటాల్లో భర్తలను కోల్పోయిన మహిళలకు మధులిక ఓదార్పునిచ్చేవారు. దివ్యాంగులైన పిల్లల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు. సైనికుల కుటుంబ సభ్యుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆమె కృషి చేశారు. వారికోసం కుట్లు, అల్లికలు, సంచుల తయారీ, బ్యుటీషియన్ కోర్సులు నిర్వహించారు. ఆరోగ్యంపైనా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సాధారణ ప్రజల కోసం కూడా ఆమె అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితుల శ్రేయస్సు కోసం కృషి చేశారు.