Bipin Rawat Biography:భారత సైన్యాధ్యక్షుడిగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ అత్యుత్తమ సేవలు అందించారు. స్వతహాగా సైనికుడి కుమారుడైన ఆయన.. భారత సైనికదళాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తండ్రి స్ఫూర్తితో ఆయన విధులు నిర్వర్తించే బెటాలియన్‌లోనే చేరి, అంచెలంచెలుగా ఎదిగి త్రిదళాధిపతి స్థాయికి చేరారు. సైన్యానికి సేవలందిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. అదే సైన్యంలో దాదాపు 40 ఏళ్ల సేవలు అందించి, ఎన్నో శిఖరాలను అధిరోహించారు.
Bipin Rawat Education:
1958 మార్చి 16న ఉత్తరాఖండ్‌లో హిందూ గర్వాలీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. బిపిన్ తండ్రి లక్ష్మణ్‌సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ హోదాలో పనిచేశారు. ఆయన తల్లి ఉత్తరకాశీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె. దేహ్రాదూన్‌లోని కాంబ్రియన్ హాల్, సెయింట్ ఎడ్వర్డ్స్ పాఠశాలలో రావత్ విద్యాభ్యాసం చేశారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఖడక్‌వల్సా), ఇండియన్ మిలిటరీ అకాడమీ (దేహ్రాదూన్), వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో చదువుకున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన ప్రతిభకు ‘స్వార్డ్ ఆఫ్ ఆనర్’ అవార్డు లభించింది. అమెరికా కాన్సాస్‌లోని యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్స్ చేశారు.
Rawat Army Background:
1978 డిసెంబరు 16న బిపిన్ రావత్ ఆర్మీలో చేరారు. తన తండ్రి పనిచేసిన 11 గోర్ఖా రైఫిల్స్ ఐదో బెటాలియన్‌లోనే బాధ్యతలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతాల్లో చేసే యుద్ధాల్లో రావత్‌కు తిరుగులేదు. పదేళ్ల పాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లోని ఉరీలో మేజర్ హోదాలో పనిచేశారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2016 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. గోర్ఖా బ్రిగేడ్ నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎదిగిన ముగ్గురు అధికారుల్లో రావత్ ఒకరు. అంతేకాదు.. ఆయన నేపాల్ ఆర్మీకి గౌరవాధ్యక్షులు కూడా.
Bipin Rawat missions:
చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. 1962 యుద్ధం తర్వాత మెక్‌మోహన్ రేఖ వద్ద జరిగిన తొలి సైనిక ఘర్షణ ఇదే. ఈ సమయంలో తన బృందాన్ని ఆయన సమర్థంగా నడిపించారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐరాస తరఫున నిర్వహించిన మిషన్.. రావత్ విజయాల్లో చెప్పుకోదగినది. దక్షిణ కివూ రాజధాని గోమాను ఆక్రమించుకునేందుకు సాయుధ తిరుగుబాటుదారులు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు. ఐరాస శాంతి దళాల తరఫున పోరాడిన బృందానికి రావత్ అధ్యక్షత వహించారు. మిషన్‌లో పాల్గొన్న సైనికుల్లో సగం మంది రావత్ బృందంలో ఉన్నారు. ఈ ఆపరేషన్ నాలుగు నెలలు జరిగింది. గోమాను తిరుగుబాటుదారుల వశం కాకుండా కాపాడటమే కాకుండా.. సాయుధ దళాలను చర్చలకు దిగివచ్చేలా చేశారు.
Bipin Rawat Surgical Strike:
సర్జికల్ స్ట్రైక్... ఈ మాట వినగానే గుర్తుకొచ్చే పేరు జనరల్ బిపిన్ రావత్! 2016 సెప్టెంబరు 29న పాక్ సరిహద్దుల్లోకి భారత సైన్యం వెళ్లి అత్యంత సాహసోపేతంగా అక్కడి ఉగ్ర స్థావరాలను కూకటివేళ్లతో పెకలించిన ఘటన గుర్తుకొస్తేనే భారతీయులందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రావత్ భారత సైన్యానికి ఉప అధిపతి అయిన నెల రోజుల్లోపే ఈ దాడి జరిగింది. ఉరీలోని సైనిక శిబిరం మీద, పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగం మీద జరిగిన దాడులకు ప్రతీకారంగా బిపిన్ రావత్ నేతృత్వంలో చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్‌లో పలువురు ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు వాళ్ల శిబిరాలనూ మన సైన్యం ధ్వంసం చేసింది.
Bipin Rawat Myanmar Attack: