ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా.. ప్రతిభావంతులకు ముఖ్య వేదికగా మారింది. వివిధ రంగాల్లో టాలెంట్ ఉన్న అనేకమంది వ్యక్తులు.. సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వస్తున్నారు. కొందరు ట్రెండింగ్‌లో ఉన్న పాటలకు డ్యాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. దాంతో పాటు అవకాశాలను చేజిక్కుంచుకుంటున్నారు. మరికొందరు తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారి ఫేమస్ అవుతున్నారు. బిహార్‌కు చెందిన అమర్జీత్ జైకర్ అనే యువకుడు కూడా ఆ కోవకు చెందినవాడే. రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిపోయాడు!
సమస్తిపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాపుర్ పటోరి భభూవ గ్రామమే అమర్జీత్ స్వస్థలం. చదువుకుంటూ.. స్థానికంగా జరిగే పెళ్లిళ్లకు క్యాటరింగ్ బాయ్‌గా పనిచేసేందుకు అమర్జీత్ వెళ్లేవాడు. అలా మెల్లమెల్లగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత.. క్యాటరింగ్ బాయ్‌గా కాకుండా వివాహ వేడుకల్లో పాటలు పాడేవాడు. అనేక చోట్ల స్టేజీ షోలు కూడా ఇచ్చాడు. దాంతో పాటు అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో తాను పాడిన వీడియోలను పోస్ట్ చేసేవాడు. ఇటీవలే బాలీవుడ్లో ఫేమస్ అయిన 'దిల్ దే దియా హై పా' పాట పాడిన వీడియోను షేర్ చేశాడు. ఒక్కసారిగా ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు.
అయితే అమర్జీత్ వీడియో చూసిన కొందరు బాలీవుడ్ ప్రముఖులు.. అతడిని ప్రశంసించారు. బీటౌన్ స్టార్ హీరో సోనూసూద్.. అమర్జీత్ వీడియోను రీషేర్ చేశారు. సోనూసూద్‌తో పాటు నటి నీతూచంద్ర.. అతడిపై ప్రశంసలు కురిపించారు. "ఈ వ్యక్తి ఎవరు? అద్భుతం. దయచేసి అతడి కాంటాక్ట్ నంబర్‌ను పంపండి." అంటూ ట్వీట్ చేశారు.