Drunk man dares police: బిహార్లో మద్యపాన నిషేధం విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మద్యం తయారీ, విక్రయాలతో పాటు తాగటమూ నేరమే. నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైలుకు పంపుతామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయితే, ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి పోలీసులకే సవాల్ విసిరాడు. 'నేను మందు కొట్టాను, దమ్ముంటే పట్టుకోండి' అంటూ స్టేషన్కు ఫోన్ చేశాడు. అరెస్టై జైలు పాలయ్యాడు.
ఇదీ జరిగింది:పశ్చిమ చంపారన్ జిల్లా శిఖర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంకి గ్రామానికి చెందిన అమ్రేశ్ కుమార్ సింగ్.. పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి తాను మద్యం సేవించానని, మీకు చేతనైతే పట్టుకోవాలంటూ సవాల్ చేశాడు. తాను ఓ జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు. అయితే, ఎవరో కావాలని ప్రాంక్ చేస్తున్నారని భావించిన స్టేషన్ అధికారి అజయ్ కుమార్ ముందు పట్టించుకోలేదు. కానీ, పలుమార్లు ఫోన్ చేయగా.. పోలీసులు అమ్రేశ్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న అతడ్ని అరెస్ట్ చేశారు.