Bihar Caste Census Supreme Court Centre Reply : బిహార్‌లో సీఎం నీతీశ్ ప్రభుత్వం తీసుకున్న కులగణన సర్వే నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. జనాభా గణన కేంద్రానికి సంబంధించిన అంశమని పేర్కొంటూ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. జనగణన ( Bihar Caste Census Data ) కేంద్ర జాబితాలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ అధికారం ఉందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అఫిడవిట్‌లో పేర్కొంది. జనాభా గణన చట్టబద్ధమైన ప్రక్రియ అని, జనాభా గణన చట్టం 1948 ప్రకారం దీన్ని చేపడతారని పేర్కొంది. భారత రాజ్యాంగం ఏడవ షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో దీన్ని చేర్చినట్లు తెలిపింది. రాజ్యాంగంలోని నిబంధనలు, వర్తించే చట్టానికి అనుగుణంగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
కులాల వారీగా జనాభా లెక్కించేందుకు బిహార్ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. పట్నా హైకోర్టు ఇటీవల బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన బెంచ్.. విచారణ చేపడుతోంది. కుల గణన చేపట్టడం ద్వారా వ్యక్తుల గోప్యతా హక్కుకు ప్రభుత్వం భంగం కలిగిస్తోందని యూత్ ఫర్ ఈక్వాలిటీ స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. అయితే, కుల గణనలో సేకరించిన సమాచారాన్ని బహిరంగంగా ప్రచురించనప్పుడు సమస్యేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతకుముందు.. కుల గణనకు పట్నా హైకోర్టు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.