Bigg Boss Contestant Varthur Santhosh Arrested :కన్నడ బిగ్‌బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ వర్తూరు సంతోష్‌ను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మెడకు పులిగోరు లాకెట్ ధరించారనే కారణంతో సంతోష్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన అధికారుల అదుపులోనే ఉన్నారు. సోమవారం సంతోష్‌ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
వర్తూరు సంతోష్ మెడకు పులిగోరు లాకెట్ ధరించారనే ఫిర్యాదు.. ప్రజల నుంచి తమకు అందిందని పారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లోకే వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సంతోష్ ధరించింది నిజమైన పులిగోరేనని నిర్ధరించుకుని.. అనంతరం దాన్ని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 8న కన్నడ బిగ్‌బాస్ 10 రియాలిటీ షో ప్రారంభమైంది. అందులో ఓ కంటెస్టెంట్‌గా వర్తూరు సంతోష్ ఉన్నారు.
"ఆదివారం రాత్రి బెంగళూర్‌లోని కోమఘట్ట సమీపంలో ఉన్న బిగ్‌హౌస్ వెళ్లి తనిఖీలు చేశాం. లాకెట్‌ను ఇవ్వాల్సిందిగా నిర్వాహకులను కోరాం. కొంత సమయం అనంతరం దాన్ని మాకు ఇచ్చేందుకు సంతోషన్ అంగీకరించారు." అని పోలీసులు తెలిపారు. తమ పరిశీలనలో అది నిజమైన పులిగోరుగా తేలిందని వారు వెల్లడించారు. దాదాపు 8.30 గంటల ప్రాంతంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.