Biden Convoy DriverDetained :జీ20 సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్‌ను శనివారం రాత్రి భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం వల్ల డ్రైవర్‌ను భద్రతా దళాలు ప్రశ్నించాయి. బైడెన్ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు అమెరికా నుంచి రాగా.. మరికొన్నింటిని భారత్‌లోనే కేటాయించారు. వీటిల్లో అద్దెకు తీసుకొన్న కారు ఒకటి ఉంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బసచేసే హోటల్ ఐటీసీ మౌర్యా వద్ద అది ఉండాల్సి ఉండగా.. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బస చేస్తున్న తాజ్ హోటల్ వద్ద అది కనిపించింది. ఓ వ్యాపారవేత్తను అక్కడ దింపేందుకు తాను వచ్చానని బైడెన్ కాన్వాయ్ డ్రైవర్ అధికారులకు చెప్పాడు. ప్రొటోకాల్ గురించి తనకు తెలియదని అన్నాడు. కొన్ని గంటలు ప్రశ్నించిన తర్వాత భద్రతా దళాలు అతడిని వదిలిపెట్టాయి. బైడెన్ కాన్వాయ్ నుంచి అతడి వాహనాన్ని తొలగించారు.
Modi Biden Bilateral Talks : జీ20 శిఖరాగ్ర సదస్సులోపాల్గొనేందుకు శుక్రవారం భారత్‌కు వచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఆయన.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ బైడెన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేతలిద్దరూ పలు అంశాలపై చర్చించారు.
బైడెన్‌తో భేటీతో ఫలప్రదంగా జరిగిందని.. భారత్- అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే అనేక అంశాలపై చర్చించినట్లు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు మోదీ. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించి.. వియత్నాంకు బయలుదేరారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.