భీమా-కోరెగావ్ యుద్ధానికి 205 ఏళ్లు పూర్తైన సందర్భంగా మహారాష్ట్రలోని పుణెలో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. రెండేళ్ల నిషేధం తర్వాత జరిగిన కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అర్ధరాత్రే కోరెగావ్‌కు చేరుకున్న ప్రజలు.. అక్కడ ఉన్న ఉన్న 'విజయస్తంభం' వద్ద నివాళులు అర్పించారు. భారత బౌద్ధ మహాసభ వేకువజామున ఇక్కడ 'ధమ్మాచన' (బుద్ధుడి ప్రార్థన) నిర్వహించింది. అనంతరం సమత సైనిక్ దళ్, మహార్ బెటాలియన్‌కు చెందిన మాజీ సైనికులు కవాతు చేశారు.
రెండేళ్ల నిషేధం తర్వాత 'భీమా కోరెగావ్'లో వేడుకలు.. భారీగా జనం
రెండేళ్ల నిషేధం తర్వాత జరిగిన భీమా కోరెగావ్ యుద్ధ వార్షికోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. యుద్ధస్మారక చిహ్నం వద్ద ప్రార్థనలు నిర్వహించారు.
1818లో అప్పటి పుణె పాలకుడైన బ్రాహ్మణ పీష్వాపై జరిగిన యుద్ధంలో దళిత మహర్ సైన్యంతో కూడిన బ్రిటిష్ దళాలు విజయం సాధించాయి. అగ్రవర్ణాలపై గెలుపును గుర్తు చేసుకునేందుకు ఏటా ఇక్కడ వేడుకలు నిర్వహించుకుంటారు. కాగా, 2018లో ఇక్కడ తీవ్ర ఘర్షణ చెలరేగింది. ద్విశతాబ్ది వేడుకల కోసం 2018 జనవరి 1న యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించుకునేందుకు దళితులు భీమా కొరెగావ్కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు రాళ్లు రువ్వడం వల్ల గొడవ ప్రారంభమైంది. ఈ ఘటన వెనుక పలువురు మావోయిస్టుల హస్తం ఉన్నట్లు పుణె పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా వరవరరావు, సుధా భరద్వాజ్ సహా మరికొందరిని అరెస్టు చేశారు. అయితే, స్థానిక దళితులు మాత్రం దీనివెనక హిందుత్వ కార్యకర్తలైన సంభాజీ భిడె, మిలింద్ ఏక్బోతెల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. వీరిపైనా కేసు నమోదైంది.