దేశాన్ని పాలనాపరంగా, ఆర్థికంగా బలపరిచి పాక్‌ను దీటుగా ఎదుర్కొనేందుకే ఎన్నికలు గానీ... ప్రధాని కావాలన్న యువరాజు కలను సాకారం చేసేందుకు కాదని భాజపా అధ్యక్షుడు అమిత్ షా దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని షా ఈ విమర్శలు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఉమ్రియా జిల్లాలో భాజపా 'విజయ్ సంకల్ప్' బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్ స్థావరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం చేసిన దాడులపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి బంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు.
"నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఉన్న ఉగ్రవాదులందరూ దాదాపుగా ఏరివేయబడ్డారు" అని షా పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ సైనికులకు ఇచ్చే ఒక దేశం ఒకే పెస్షన్ (ఓఆర్ఓపీ) అమలు, జాతీయ యుద్ధ స్మారకం నిర్మాణాన్ని చేపట్టలేకపోయారని షా విమర్శలు గుప్పించారు. దిల్లీ ఇండియా గేట్ సమీపంలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ఈ నెల 25వ తేదీన ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు.