ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ.. ప్లాస్టిక్ బాటిల్ మీదే 1,829 సార్లు 'ప్లాస్టిక్ వాడకండి' అని రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కైవసం చేసుకున్నాడు కర్ణాటకకు చెందిన ఓ యువకుడు.
రామనగర జిల్లా, చన్నపట్న తాలూకా, కొడంబల్లి గ్రామానికి చెందిన శివకుమార్ సాధారణ జిమ్ కోచ్. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో యోగా ప్రదర్శకుడు కూడా. శారీరక ఆరోగ్య ప్రాముఖ్యత తెలిసిన శివకుమార్.. పర్యావరణం ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుందని భావించాడు. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొడితే ప్రకృతికి పట్టిన పీడ సగం నయమవుతుందని బలంగా నమ్మాడు.
మన జీవితాల్లో భాగమైపోయిన ప్లాస్టిక్‌ను శివకుమార్ అంత తేలిగ్గా వదిలించుకోలేకపోయాడు. అందుకే ఆ బాధను ప్లాస్టిక్ బాటిల్ మీద 30,041 అక్షరాలతో, 1,829 సార్లు 'ప్లాస్టిక్ వాడకండి' అని రాసి తెలిపాడు. ఈ బాటిల్ మీద 292 సార్లు 'ప్రపంచం' , 595 సార్లు 'ఇండియా' పదాలను వాడాడు. ఇలా ప్లాస్టిక్ నిషేధంపై వినూత్న రీతిలో అవగాహనలో భాగంగా అతడి కృషికి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో చోటు దక్కింది.