తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' తదుపరి సీఎం మా పార్టీ నుంచే: శివసేన - ఠాక్రే

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి తమ పార్టీ వారే అవుతారని శివసేన ప్రకటించింది. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయాన్ని పేర్కొంది. పార్టీ వ్యవస్థాపక కార్యక్రమానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడణవీస్​ హాజరైన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేసింది.

'మహా' తదుపరి ముఖ్యమంత్రి మా పార్టీ నుంచే: శివసేన

By

Published : Jun 20, 2019, 7:25 PM IST

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు మరోసారి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.తమ పార్టీకి చెందిన వ్యక్తే రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి అవుతారని శివసేన ధీమా వ్యక్తం చేసింది. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయాన్ని పేర్కొంది.

తమ పార్టీ 53వ ఆవిర్భావ దినోత్సవానికి భాజపా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ హాజరైన మరుసటి రోజే సామ్నాలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఇలా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి మిత్రపక్షం శివసేన.

'రాష్ట్రంలో భాజపాతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. శివసేన ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వం ఉన్న పార్టీ. వచ్చే సంవత్సరం పార్టీ 54వ ఆవిర్భావ దినోత్సవం నాటికి వేదికపై శివసేన ముఖ్యమంత్రి కూర్చుంటారని నిర్ధరించుకోండి'

- సామ్నాలో శివసేన

శివసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన తొలి శివసేనేతర పార్టీ సీఎం ఫడణవీస్​ కావడం విశేషం. పార్టీ వ్యవస్థాపక కార్యక్రమానికి హాజరుకావాలని సీఎంకు ప్రత్యేక ఆహ్వానం పంపారు శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే.

తొలిసారి శివసేనేతర పార్టీ ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి ఫడణవీస్​ హాజరవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఠాక్రే తనకు పెద్ద అన్నయ్య అని పేర్కొన్నారు ఫడణవీస్​.

వచ్చే ఎన్నికల్లో భాజపా- శివసేన కూటమి ఘనవిజయం సాధిస్తుందని.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరనేది తర్వాతి విషయమని అన్నారు సీఎం. ఈ నేపథ్యంలో సీఎం తమ పార్టీ నుంచే ఉంటారన్న శివసేన 'సామ్నా' వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details