హాయ్! మీరెప్పుడైనా చేపల శ్మశానవాటిక చూశారా? అదేంటి మనుషుల కోసం కదా శ్మశానవాటికలు ఉండేది అంటారా? నిజమండీ చేపల కోసమే ప్రత్యేకంగా శ్మశానం ఏర్పాటుచేశారు. అదీ మన కేరళలో. మరి దాని సంగతేంటో తెలుసుకుందామా?
సముద్రజీవుల పరిరక్షణ కోసం..
జీవావరణ వ్యవస్థలో సముద్ర జీవులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో కాలక్రమేణా వాటి ఉనికే ప్రమాదంలో పడింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పర్యావరణ చేతన సమూహాలు ముందుకు వచ్చాయి. అనుకున్నదే తడవుగా కేరళ కోజికోడ్‌లోని బేపూర్ తీరంలో జలచరాల కోసం ఓ శ్మశానవాటిక నిర్మించారు. ప్రపంచంలో సముద్ర జీవుల కోసం నిర్మించిన మొదటి శ్మశానం ఇదే కావడం విశేషం.
"బీచ్‌కు వచ్చే ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించేందుకే ఈ శ్మశానం ఏర్పాటుచేశాం. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న చేపల పేర్లతో ఇక్కడి సమాధులను నిర్మించాం. ఇది చూసి వారిలో పరివర్తన వచ్చి సముద్రంలో ప్లాస్టిక్ వస్తువులు పారివేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ ఉద్దేశంతో చేపల శ్మశానం ఏర్పాటుచేశాం."