తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చేతి అల్లికలతో మహిళల గిన్నీస్ రికార్డు

చెన్నైలో మదర్​ ఇండియా చేతి అల్లికల మహిళా మండలి అరుదైన ఘనత సాధించింది. వారు నిర్వహించిన అల్లికల వస్తువుల ప్రదర్శన గిన్నిస్​ బుక్​లో స్థానం సంపాదించుకుంది. వీరు 66 వేల 158  క్రిస్మస్​ అలంకరణ వస్తువుల్ని చేతి అల్లికతో రూపొందించడం విశేషం. ఫలితంగా.. గత రికార్డును అధిగమించారు.

చేతి అల్లికలతో మహిళల గిన్నీస్ రికార్డు

By

Published : Sep 16, 2019, 1:59 PM IST

Updated : Sep 30, 2019, 7:56 PM IST

చేతి అల్లికలతో మహిళల గిన్నీస్ రికార్డు

చెన్నై సమీపంలోని ఎస్​ఆర్​ఎమ్​ విశ్వవిద్యాలయంలో జరిగిన అల్లికల వస్తువుల ప్రదర్శన గిన్నీస్ బుక్​లో స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా చేతి అల్లికతో చేసిన క్రిస్మస్ అలంకరణ వస్తువుల్ని రూపొందించి... ఈ ఘనత సాధించింది మదర్​ ఇండియా చేతి అల్లికల మహిళా బృందం.

2014లో అత్యధికంగా 4418 చేతి అల్లికలతో చేసిన క్రిస్మస్ అలంకరణ వస్తువుల ప్రదర్శనను ప్రస్తుత రికార్డు అధిగమించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్త రికార్డును మరెవరూ అంత సులభంగా ఛేదించే వీలులేనట్లు పేర్కొన్నారు.

చెన్నైకు చెందిన శుభశ్రీ నటరాజన్ మదర్ ఇండియా క్రోషియా క్వీన్స్ అనే గ్రూపును స్థాపించారు. చేతి అల్లికలను వ్యాపకంగా పెట్టుకున్న దేశవిదేశాల్లోని భారత మహిళలను ఫేస్​బుక్ ద్వారా అనుసంధానం చేసి అల్లికల్లో అధునాతన సృజనాత్మకతను ఈ గ్రూప్ ద్వారా ప్రోత్సహిస్తున్నారు.

''మేం ఈ విజయంతో వరుసగా నాలుగోసారి గిన్నీస్​ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 350 మంది మహిళలు పాల్గొన్నారు. భారత్ సహా 7 దేశాల్లోని మహిళలు భాగస్వాములయ్యారు. మొత్తం చేతి అల్లికలతో 66 వేల 158 క్రిస్మస్​ అలంకరణ వస్తువులు రూపొందించాం. ఇది ప్రకటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''

-శుభశ్రీ నటరాజన్​, మదర్​ ఇండియా క్రోషియా క్వీన్స్​ స్థాపకురాలు

గతంలోనూ గిన్నీస్​ రికార్డులు...

ఈ మహిళల బృందం గతంలోనూ అద్భుతాలు చేసింది. అత్యంత పొడవైన అల్లికల వస్త్రాన్ని చేతితో నేసి గిన్నీస్ బుక్​లో స్థానం సంపాదించారు మహిళలు. అలాగే అత్యంత పెద్దదైన అల్లికల వస్త్రాన్ని ప్రదర్శించి మరో గిన్నీస్ రికార్డ్​ను​ సొంతం చేసుకున్నారు.

తాజాగా అల్లికలతో మరో గిన్నీస్ రికార్డును సాధించాలనుకున్నారు. ఈ మేరకు తమ బృందం మహిళలకు సమాచారమిచ్చారు శుభశ్రీ. అనుకున్నదే తడవుగా తమ సృజనాత్మకతకు పదును పెట్టి వివిధ రకాల క్రిస్మస్ అలంకరణ వస్తువులను చేతితో అల్లారు. ఈ వస్తువులన్నీ కలిపి 66 వేలు దాటాయి.

ఆ వస్తువుల్ని చెన్నైలోని ఎస్​ఆర్​ఎమ్ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచారు. గిన్నీస్ నిర్వాహకులు ఈ వస్తువులు చూసి చేతితో అల్లిన అత్యధిక వస్తువులు ఒకే చోట ప్రదర్శించడం ప్రపంచంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కుక్కకు లైసెన్స్​ తప్పనిసరి- ఫీజు రూ.5వేలు!

Last Updated : Sep 30, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details