ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా గోందెరాస్ గ్రామం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ గుర్తుందా? గురువారం జరిగిన ఆ ఘటనలో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఆ ఆపరేషన్లో టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు మహిళా కమాండోలూ పాల్గొన్నారు. వీళ్లే "దంతేశ్వరీ లడాకే" ప్లాటూన్ సభ్యులు. మొత్తం 30 మంది ఈ బృందంలో ఉన్నారు. బస్తర్ ప్రాంతంలో నక్సలిజం అంతం చేయటమే ఈ దళం లక్ష్యం.
ప్రతికూలతలను అధిగమించేలా శిక్షణ
ఈ 30 మంది దంతేశ్వరీ లడాకే సభ్యులకు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో పాల్గొనేందుకు, ప్రతికూలతలను అధిగమించేందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. శారీరక పటుత్వం కోసం ఉదయమే పరుగు, డ్రిల్ నేర్పిస్తున్నారు. షూటింగ్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఐఈడీల ముప్పు లేకుండా, అటవీ ప్రాంతంలో సంచరించేందుకు బైక్ రైడింగ్ నేర్పిస్తున్నారు.
మూడు నెలల క్రితం వీరికి శిక్షణ మొదలైంది. మరో మూడు నెలల్లో పూర్తవుతుంది. నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్లలో పురుషులతో కలిసి వీళ్లు పాల్గొంటారు.
"బస్తర్ బెటాలియన్లో మహిళా కమాండోలను నియమించాలనే ఆలోచన ముందు నుంచే ఉంది. కానీ జిల్లా పోలీసు విభాగంలో ఈ తరహా మహిళల బృందం ఇంతకు ముందులేదు. ఇప్పుడు ఎస్పీ చొరవతో దంతేశ్వరీ లడాకే మహిళా దళం తయారైంది. దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ)లో ఇది ఆరో బృందంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం పురుషులతో కూడిన దళాలు 5 ఉన్నాయి. దంతేశ్వరీ లడాకే ఆరో దళం కానుంది."
-శిక్షణ ఇస్తున్న అధికారిణి