వరకట్నం వేధింపులకు మరో మహిళ బలైంది. అదనపు కట్నం కావాలని మృతురాలి భర్త, అత్త కనీసం ఆమెకు సరైన ఆహారం పెట్టని కారణంగా ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ.
కేరళలో మార్చి 21 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమెకు సరైన ఆహారం లేక ఎముకల కుప్పలా తయారైందని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. చనిపోయే సమయానికి అమె బరువు 20 కిలోలు మాత్రమే ఉందని తెలిపారు.
పోలీసులు కథనం ప్రకారం...
కేరళలోని కరునాగపల్లికి చెందిన తుషార (27)అనే మహిళకు చందూలాల్ అనే వ్యక్తితో 2013లో వివాహం జరిగింది.
చందూలాల్ వెల్డింగ్ సహా ఇతర చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు కొంత డబ్బు, బంగారు నగలు వరకట్నం కింద ఇచ్చారు. మరో రూ.2 లక్షలు తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బు కోసం భర్త చందూలాల్, అత్త గీతా లాల్ రోజూ తుషారను వేధించేవారని స్థానికులు చెప్పారు.
కొంతకాలంగా ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఆమెకు కనీసం తిండి కూడా పెట్టడం మానేశారు. తుషార రోజూ తడి బియ్యం, చక్కెర మాత్రమే తినేదని... ఆ కారణంగానే తీవ్ర అనారోగ్యం పాలైందని వైద్యులు గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త, అత్తలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
తుషారకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరికి ఒకటిన్నర ఏళ్లు. మరో చిన్నారి వయసు 3 ఏళ్లు. వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.