'ఈ ఊర్లోనే ఉంటే ఏం సాధిస్తాం? జీవితంలో విజయం పొందాలంటే.. నగరాలకు పోవాలి. విదేశాలకు వెళ్లాలి' అని అపోహపడేవారికి సమాధానమిస్తోంది రాజస్థాన్ సిరోహీ జిల్లాకు చెందిన టీపు. సొంత గ్రామంలోనే హస్తకళ పరిశ్రమను స్థాపించి 70 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. యావత్ ప్రపంచానికి గిరిజనుల సత్తా చాటుతోంది.
ప్రతిభ ఆమె ఆయుధం..
ఆబురోడ్ ఆదివాసి బహుల్లోని సియావా అనే మారుమూల గ్రామంలో నివసిస్తోంది టీపు. ఊరిని విడిచి కనీసం పొలిమేర కూడా దాటలేదు. సంప్రదాయాలను విస్మరించలేదు. 18 ఏళ్ల క్రితం తన చేతిలో ఉన్న ప్రతిభనే ఆయుధంగా చేసి మట్టికి జీవం పోసింది. అందమైన బొమ్మలుగా మలచింది. ఒంటరిగా ప్రారంభించిన ఈ వృత్తిలో క్రమంగా స్వయం సహాయక బృందంలోని మహిళలనూ భాగస్వాములను చేసింది. ఇప్పుడు టీపు కుటీర పరిశ్రమలో దాదాపు 70 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.
"మేము మట్టిబొమ్మలు తయారు చేస్తాం. విగ్రహాలు, ఆదివాసీ రూపాలు, ఏనుగులు, గుర్రాలు, దేవతా మూర్తులు వంటి అన్నిరకాల బొమ్మలను తీర్చిదిద్దుతాం. సుమారు 18 ఏళ్ల నుంచి ఈ పని చేస్తున్నా."