తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్ బరి: నేరచరితుల భార్యలదే హవా! - అధికార జేడీయూ

దోషులుగా తేలిన వారు, తీవ్ర నేరాలకు పాల్పడిన అక్రమార్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో పాల్గొనకూడదని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ తరుణంలో బిహార్​లో నేరచరిత్ర కల్గిన నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. బిహారీలు బాహుబలులుగా పిలుచుకునే ఈ నేతలు ఎలాగోలా రాజకీయాలపై తమ ప్రభావం ఉండేలా చూసుకుంటున్నారు. ప్రాంతంపై పట్టుసడలకుండా సతీమణులను బరిలోకి దించుతూ.. పరోక్షంగా పదవులు అనుభవిస్తున్నారు.

Bihar assembly elections
బిహార్ బరి: భర్తలను వద్దంటే బరిలోకి సతీమణులు

By

Published : Oct 1, 2020, 5:28 PM IST

బిహార్​ రాజకీయాలతో నేరస్థులది విడదీయరాని బంధం. అభ్యర్థి విజయం కోసం ఎంతకైనా తెగించే ముఠాలు అక్కడ కోకొల్లలుగా కనిపిస్తాయి. చాలాసార్లు నేరాలు చేసినవారే పట్నాలోని శాసనసభలో చట్టాలు చేసిన దాఖలాలు అనేకం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. నేరస్థుల ఎన్నికల పోటీ పట్ల కఠిన ఆంక్షలు విధించింది. కానీ, నేరాల్లో ఆరితేరిన బాహుబలులు.. ఎలాగోలా అధికారం హస్త గతం చేసుకునే ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతోంది.

రాజకీయాల్లో వీరిదే హవా

రాజకీయ పార్టీలకు వేర్వేరు సిద్ధాంతాలు, విధానాలు, వైఖరులు ఉంటాయి. కానీ, ఎన్నికల సమయంలో అన్ని పార్టీలను ఆకర్షించేది మాత్రం ఈ నేరాల వీరులే. ఎన్ని నేరాలు చేసి ఎంత ఎక్కువ పేరు సంపాదిస్తే.. అభ్యర్థిత్వానికి అంత భరోసా. బిహార్​లో ఈ ధోరణి మరింత ఎక్కువ. స్వప్రయోజనాలకు ఈ నేరాల నాయకులు టికెట్లు ఆశిస్తారు, పార్టీ అవసరాలకోసం అధిష్ఠానాలు కేటాయిస్తాయి. ఇక మరోదిక్కు లేక ప్రజలు ఓట్లు వేస్తారు. ఒక్కోసారి కుటుంబసభ్యులనో, బంధువులనో నిలబెట్టి అధికారం అనుభవిస్తుంటారు ఈ నేరచరితులు.

ఇప్పటికీ, నేరచరిత్ర కలిగిన నాయకుల నీడల కబంధహస్తాల్లో చిక్కుకునే ఉన్నాయి బిహార్​ రాజకీయాలు. వీరు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా.. రాజకీయాల్లో వీరి జోక్యం ఎక్కువగానే ఉంటుంది.

ప్రత్యామ్నాయ మార్గాలు

బాహుబలులుగా పిలుచుకునే ఈ నాయకులు గతంలో బిహార్ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించారు. సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్​ విధించిన కఠిన ఆంక్షల తర్వాత వీరి ప్రత్యక్ష హంగామా కాస్త తగ్గింది. ఈ పరిస్థితుల్లోనే భుజబలంతో పాటు బుద్ధిబలం ఉన్న కొందరు నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించుకున్నారు.

పోటీల్లో తమ తమ సతీమణులను నిలబెట్టి, టికెట్​ దక్కించుకుని దర్జాగా అధికారం అనుభవించేస్తున్నారు.

అధికార పక్షంలో అంతటా వారే

అధికార జేడీయూలో ఈ తరహా నేతల ప్రభావం ఎక్కువగా ఉంది. బనియాపూర్​ ఎమ్మెల్యే ధుమాల్​ సింగ్​, ఔరంగాబాద్​ నుంచి రణ్​విజయ్​ సింగ్​, సివాన్ స్థానం​ నుంచి అజయ్​ సింగ్​ ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరికే కాదు వీరి కుటుంబసభ్యులకు సీట్లివ్వటంలోనూ ముందే ఉంది జేడీయూ. బూటాన్​ సింగ్ సతీమణి, లేసీ సింగ్​ శాసనసభ్యురాలిగా ఉన్నారు.

అవధేశ్ మండల్​ సతీమణి బిమా భారతి.. బిహార్​ మంత్రిగా ఉన్నారు. రణ్​వీర్​ యాదవ్​ సతీమణి పూనమ్​ యాదవ్​ కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అజయ్​ సింగ్​ సతీమణి కవితా సింగ్, మున్నా శుక్లా తరఫున అను శుక్లా కూడా ఈ జాబితాలో ఉన్నారు.

సతీమణులను ప్రోత్సహిస్తున్న భాజపా

భాజపా సైతం నేరచరిత్ర కలిగిన నాయకుల సతీమణులకు టికెట్లు ఇచ్చేందు ఆసక్తి చూపుతోంది. బక్సర్​కు చెందిన భువార్​ ఓజా సతీమణి భాజపా ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఎల్జేపీతో విడదీయలేని బంధం

లోక్​ జనశక్తి పార్టీకి ఈ తరహా నేతలతో బలమైన సంబంధాలున్నాయి. ఒక దశలో ఈ నేర చరిత్ర కలిగిన నేతలందరూ ఈ పార్టీలోనే ఉండేవారు. ప్రస్తుతానికి సుర్జ్​​భాన్ సింగ్​ సతీమణి రినా దేవి పార్టీ తరఫున క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన సోదరుడు చందన్​ సింగ్ సైతం రెండు సార్లు ఎంపీగా పనిచేశారు.

ఈ పోటీలో హెచ్​ఏఎం

హిందుస్థానీ అవామీ మోర్చా అధినేత జీతన్​ రాం మాంఝీ సైతం ఈ తరహా నేతలను ప్రోత్సహించటంలో ముందున్నారు. బాహుబలి నేత ఆనంద్​ కుమార్​ తరఫున ఆయన సతీమణి లవ్లీ ఆనంద్​ పోటీ చేశారు. ఈ ఎన్నికలకు ముందు ఆర్జేడీలోకి చేరారు.

పోటాపోటీగా కాంగ్రెస్​

కాంగ్రెస్​ సైతం ఈ పోటీలో వెనకబడలేదు. నేర చరితులకు టికెట్లు ఇస్తూనే ఉంది. పలిగంజ్​ ఎమ్మెల్యే సిద్ధార్థ్​ను బాహుబలి నేతగానే చూస్తారు. అనంత్​ సింగ్​ సతీమణి నీలం సింగ్​ను లోక్​సభ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టింది.

ఆర్జేడీ తక్కువేం కాదు

రాష్ట్రీయ జనతా దళ్​... నేరారోపణలు ఉన్న నేత రాజ్​భల్లా యాదవ్​ను అసెంబ్లీకి పంపింది. కోర్టులో నేరం రుజువు కావటం వల్ల ఆయన పదవి సైతం పోయింది.

మాజీ ఎంపీ షాబుద్దీన్ సతీమణి హినా సాహెబ్ ఆర్జేడీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ​సందేశ్​ ఎమ్మెల్యే అరుణ్​ యాదవ్​పైనా అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో సతీమణిని పోటీకి దింపుతున్నారు.

పార్టీల సమర్థన

ఈ అంశాన్ని ఆర్జేడీ సమర్థించుకుంటోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందని చెబుతోంది. అంతిమ నిర్ణయం ప్రజలదే కాబట్టి పోటీకి అనుమతించాలని చెబుతోంది.

ఇతర పార్టీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. హెచ్​ఏఎం నేతలు పోటీ చేయటం ప్రజస్వామ్య హక్కు అని వాదిస్తున్నారు. ప్రజలు చాలా తెలివిగా ఉన్నారని.. ప్రభావితమయ్యే రోజులు పోయాయని జేడీయూ నేతలు అంటున్నారు.

ఇదీ చూడండి:బిహార్​ బరి: కొత్త పార్టీలకు ఆదరణ దక్కేనా?

ఇదీ చూడండి:బిహార్​ బరి: సం'కుల' సమరంలో గెలుపు ఎవరిది?

ఇదీ చూడండి:బిహార్​ పోరు: సందిగ్ధంలోనే సీట్ల పంపకం

ABOUT THE AUTHOR

...view details