మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ కూటమితో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మరోమారు పునరుద్ఘాటించింది శివసేన. మహా వికాస్ అఘాడీలో తమను విస్మరిస్తోందని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో.. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసాన్ని ప్రచురించింది శివసేన.
" వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీల మధ్య కలహాలు సహజమే.. అయినప్పటికీ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికొచ్చిన ప్రమాదమేమీ లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారు కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు. అందుకే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ఠాక్రే కచ్చితంగా సిద్ధమై ఉండాలి.
అసలు కాంగ్రెస్ ఏం చెప్పాలనుకుంటోంది? బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్ లాంటి కాంగ్రెస్ నాయకులకు సుదీర్ఘకాలం ప్రభుత్వంలో కొనసాగిన అనుభవం ఉంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ప్రభుత్వంలో చాలాకాలం పనిచేశారు. కానీ ఎన్సీపీ నుంచి ఎలాంటి ఫిర్యాదులూ లేవు. కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతటివారైనా ముఖ్యమంత్రి ఆదేశానుసారం నడుచుకోవాల్సిందే. అయినప్పటికీ చవాన్, థోరట్ లాంటి వారి మాటలను ఠాక్రే వినాల్సిందే."
- సామ్నా వ్యాసం