ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా ఆశ్రిత పెట్టుబడిదారులకు లక్షల కోట్లు ధారాదత్తం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
కేరళ కొల్లాంలో ఎన్నికల సభలో ప్రసంగించారు రాహుల్. కాంగ్రెస్ ఇచ్చిన న్యాయ్ హామీపై అధికార పక్షం విమర్శలను తోసిపుచ్చారు.
'న్యాయ్కు అంబానీలతో న్యాయం చేయిస్తాం'
నరేంద్రమోదీ కొన్ని లక్షల కోట్లను 15 మంది శ్రీమంతులకు ఇచ్చినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ అదే పనిని పేద వారి కోసం చేస్తుంది. నిధులెక్కడి నుంచి వస్తాయని మోదీ అడుగుతున్నారు. అవి మధ్య తరగతి నుంచే రావాలని అంటున్నారు. నేను ఈ వేదిక నుంచి స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఒక్క రూపాయి కూడా మధ్య తరగతి నుంచి తీసుకోం. ఆదాయపు పన్ను పెంచబోం. అనిల్ అంబానీ లాంటి వాళ్ల నుంచి ఈ నిధులు వస్తాయి. చట్టాన్ని అనుసరించేవారి నుంచి కాకుండా... మోదీకి స్నేహితుల కావటం వల్ల వేల కోట్లు లబ్ధి పొందిన అశ్రిత పెట్టుబడిదారుల నుంచి వస్తాయి.
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
జాతీయవాదం గురించి మాట్లాడే మోదీ రూ. 30వేల కోట్ల రఫేల్ కాంట్రాక్టును ఇంతరవరకు ఒక్క విమానం తయారు చేయని అనిల్ అంబానీకి ఇచ్చారని రాహుల్ ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చటంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు.