బంగాల్లో ఎన్ఆర్సీపై రాజకీయ రగడ పశ్చిమ్బంగాల్లో జాతీయ పౌర రిజిస్టర్ నిర్వహిస్తామన్న భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రకటనతో రాజకీయ రగడ మొదలైంది. భాజపా, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్ఆర్సీని అనుమతించేది లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.
బంగాల్లోని అలీపూర్ద్వార్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు అమిత్ షా. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాగానే బంగాల్లో జాతీయ పౌర రిజిస్టర్ చేపడతామని ప్రకటించారు. అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు పంపిస్తామని తెలిపారు. అందులో హిందూ శరణార్థులపై ఎలాంటి చర్యలను తీసుకోబోమని స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికే జరుగుతున్నాయని చెప్పారు.
" కేంద్రంలో మరోమారు భాజపా ప్రభుత్వాన్ని మీరు తీసుకురండి. బంగాల్లో అక్రమంగా నివసిస్తున్న ఒక్కొక్కరిని ఏరివేసే పని భాజపా ప్రభుత్వం చేపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నా. " - అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు
ఎన్ఆర్సీని అనుమతించం
భాజపా అధినేత ప్రకటనపై తీవ్రంగా స్పందించింది తృణమూల్ కాంగ్రెస్. కులం, మతం ప్రాతిపదికన ప్రజలను విడదీయాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎన్ఆర్సీని రాష్ట్రంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది.
" బంగాల్లో ఎలాంటి ఎన్ఆర్సీని అనుమతించం. కులం, మతం ప్రతిపాదికన ప్రజలు విడిపోవాలని భాజపా కోరుకుంటోంది. అలాంటి చర్యలను ఎప్పటికీ జరుగనివ్వం." - పార్థ చటర్జీ, తృణమూల్ ప్రధాన కార్యదర్శి.
సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్లో ఒక్క సీటైన గెలవాలని అమిత్ షాకు సవాలు విసిరారు చటర్జీ. బంగాల్లో భాజపా ఒక్క సీటు కూడా గెలవదని, కేంద్రంలో అధికారంలోకి రాదని పేర్కొన్నారు. దేశ ప్రజలు మోదీని అధికారం నుంచి దించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ఎన్ఆర్సీ అనేది అసోంలోని నిజమైన భారతీయ పౌరుల పేర్లతో కూడిన రిజిస్టర్. గత ఏడాది విడుదల చేసిన ఈ రిజిస్టర్వివాదస్పదంగా మారింది. చాలా దశాబ్దాలుగా రాష్ట్రంలో నివసిస్తున్న లక్షల మంది పేర్లు తొలగించారని ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.