ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన రూ.68,607 కోట్ల రుణాలను మాఫీ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులే యూపీఏ పాలనలో ఫోన్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా లబ్ది పొందారని వ్యాఖ్యానించారు. భాజపా మిత్రులు అవడం వల్లే ఈ రుణాలను కేంద్రం రద్దు చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించారు ఆర్థిక మంత్రి. యూపీఏ జమానా నాటి ఉద్దేశ పూర్వక ఎగవేతదారులు రుణాలను చెల్లించేలా మోదీ సర్కార్ వెంటాడుతోందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"రాహుల్ గాంధీ, రణ్‌దీప్ సుర్జేవాలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి సంచలనాలుగా మలచే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు."
-నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి
బ్యాంకింగ్ వ్యవస్ధను ఎందుకు ప్రక్షాళించలేదో రాహుల్ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 2009-10, 2013-14లో యూపీఏ హయాంలో బ్యాంకులు రూ.1,45, 000 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని.. ఈ అంశమై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అడిగి రాహుల్ తెలుసుకోవాలని సూచించారు నిర్మల. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ఆపడానికి ఎలాంటి చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించలేదని విమర్శించారు.