తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపానులకు.. ఆ పేర్లు ఎలా పెడతారు?

రుతుపవనాలు సకాలంలో కేరళలోకి ప్రవేశించాయి. ఫలితంగా ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపానుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంపన్​ వచ్చి అతలాకుతం చేసింది. తాజాగా 'నిసర్గ' అనే తుపాను కూడా రానున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ తుపానులకు పేర్లు ఎవరు పెడతారు? ఎలా పెడతారు? పేర్ల వల్ల వచ్చే లాభం ఏమిటి?

Why Amphan-Nisarga or Arnab know the criteria for selection of names of tropical cyclones
తుపానులకు.. ఆ పేర్లు ఎలా పెడతారు?

By

Published : Jun 1, 2020, 7:49 PM IST

భారత్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్‌కు దక్షిణ నైరుతి దిశలో 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. దీనిని 'నిసర్గ' అని పిలుస్తున్నారు. ఇటీవల సూపర్‌ సైక్లోన్‌ 'అంపన్‌' పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో విధ్వంసం సృష్టించింది. 'అంపన్‌', 'నిసర్గ' ఇలా ఒక్కో తుపానును ఒక్కో పేరుతో పిలుస్తారు. అసలు తుపానులకు ఎవరు పేర్లు పెడతారు? ఎలా పెడతారు? అన్న విషయం చాలా మంది తెలియదు.

తుపానులకు.. ఆ పేర్లు ఎలా పెడతారు?

ఎవరు నిర్ణయిస్తారు?

తాజాగా భారత వాతావరణశాఖ రాబోయే తుపానుల పేర్ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. వీటిలో అర్నబ్‌, నిసర్గ, ఆగ్‌, వ్యోమ్‌, అజర్‌, పింకూ, తేజ్‌, గాటి, లులు తదితర 160 పేర్లు ఉన్నాయి. వీటిని హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి. వీటిలో భారత్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాల్దీవులు, మియన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్‌, యూఏఈ, యెమెన్‌ దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం 13పేర్లను సూచించాలి. తాజాగా విరుచుకుపడిన 'అంపన్‌' పేరు థాయిలాండ్‌ సూచించింది. ఈ పేరుతో 2004లో ప్రతిపాదించిన 64 పేర్లు పూర్తయ్యాయి. ఇప్పుడు కొత్తగా 169 పేర్లను ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు రీజినల్‌ స్పెషలైజ్డ్‌ మెట్రోలాజికల్‌ సెంటర్స్‌ ఉన్నాయి. వీటిలో 5 కేంద్రాల్లో తుపానుల బెడద ఎక్కువ.

తుపానులకు.. ఆ పేర్లు ఎలా పెడతారు?

ఎలా నిర్ణయిస్తారు?

  • ఒక్కో దేశం తుపానుకు పేరు ప్రతిపాదించడానికి ప్రామాణికం ఉంది.
  • ఒకసారి వినియోగించిన పేరును మళ్లీ వాడకూడదు.
  • ఈ పేర్లు ఏ రాజకీయ పార్టీని, మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా ఉండకూడదు.
  • పేరు మరీ కరకుగా, క్రూరంగా ఉండకూడదు.
  • ప్రతి ఒక్కరూ సులభంగా పలికేలా ఉండాలి.
  • పేరు ఎనిమిది అక్షరాలను మించి ఉండకూడదు.
  • ప్రతి పేరుకు పలికే విధానం వాయిస్‌తో సహా అందించాలి.
  • ఆమోదయోగ్యం కాని పేరు తిరస్కరించే అధికారం ప్యానల్‌కు ఉంది.
  • పేరును ప్రకటించే సమయంలోనూ ఒకసారి సమీక్షిస్తారు.

ఇలా పేర్లు పెట్టడం వల్ల లాభం ఏంటి?

ఒకప్పుడు తుపానుకు ఎలాంటి పేరు ఉండేది కాదు, ఫలానా సంవత్సరంలో తుపాను అంటూ పిలిచేవారు. తుపాను వాతావరణం ఏర్పడినప్పుడల్లా దాన్ని అదే పేరుతో పిలవడం వల్ల తికమకపడే అవకాశం ఉంది. ఇలా ఒక్కో తుపానుకు ఒక్కో పేరు పెడితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు, మీడియాకు, సాధారణ ప్రజలకు ఇది ఫలానా తుపాను అని గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఆ పేరుతో ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌ ఈ పేరుపెట్టింది..

ఈ తుపానుకు నిసర్గ అనే పేరును బంగ్లాదేశ్‌ సూచింది. 2020లో హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లకు కొత్తపేర్లను పెట్టే క్రమంలో ఇది మొదటిది కావడం గమనార్హం. 2004లో తొలిసారి ప్రచురించగా ఆ జాబితాలో అంపన్‌ చివరిది. 2019లో అరేబియా సముద్రంలో ఐదు తుపానులు ఏర్పడ్డాయి. 1902లోనూ ఐదు తుపాన్లు ఏర్పడ్డాయి. 1902 తరువాత అంత సంఖ్యలో తుపాన్లు రావడం 2019లోనే కావడం విశేషం.

ఇదీ చూడండి:కరోనా ఉన్నా ఆ రాష్ట్రంలో విద్యా సంవత్సరం షురూ!

ABOUT THE AUTHOR

...view details