అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన తొలి ఇండో-అమెరికన్‌గా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్.. ఇప్పుడొక హాట్ టాపిక్. దీనికి తోడు భారత దేశంతో ఆమెకున్న బంధం గురించి రోజుకో విషయం బయటకు వస్తుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా.. తన గెలుపు కోసం తన అత్తను చెన్నైలోని ఓ ఆలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రార్థించమని హ్యారిస్ కోరినట్టు న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది.
చెన్నైలోని ఆలయంలో...
'కమలా హ్యారిస్ విలువలను ఆమె కుటుంబం ఎలా తీర్చిదిద్దింది' అనే కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. దీని ప్రకారం.. 2010 కాలిఫోర్నియా అటార్నీ జనరల్ ఎన్నికల్లో పోటీ పడ్డ సమయంలో చెన్నైలోని తన అత్త సరళా గోపాలన్‌కు ఫోన్ చేశారు. బేసంత్నగర్లోని ఆలయానికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టి తన గెలుపు కోసం ప్రార్థించమని అత్తను కోరారు హ్యారిస్.