తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆపరేషన్​ కశ్మీర్​: సర్కారు ఏం చేయబోతుంది?

ప్రస్తుతం దేశంలో హాట్​టాపిక్​​గా మారిన అంశం జమ్ముకశ్మీర్. కశ్మీరేతరులను రాష్ట్రం నుంచి బయటికి పంపడం.. భారీ బలగాల మోహరింపు వంటి పరిణామాలు వివిధ చర్చలకు దారితీస్తున్నాయి. ఇంతకీ కేంద్రం ఏం యోచిస్తోంది? సర్కారు అనుకున్నట్లు చేస్తే దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది?

ఆపరేషన్​ కశ్మీర్

By

Published : Aug 5, 2019, 7:42 AM IST

Updated : Aug 5, 2019, 8:18 AM IST

జమ్ముకశ్మీర్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. పలు ఊహాగానాలకు తావిస్తున్నాయి. అదనపు బలగాల మోహరింపు, రాజకీయ నాయకుల గృహనిర్భందం వంటి అంశాలు కశ్మీర్​పై ఇటు రాజకీయంగా, అటు శాంతి భద్రతల విషయంలో పలు చర్చలకు తావిస్తోంది. అయితే కేంద్రం ఆలోచనలు ఏంటి? సర్కారు అనుకున్నట్లు పావులు కదిపితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

వాటిలో మఖ్యమైనవి ఇవే

రాష్ట్ర విభజన

ప్రస్తుతం జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము, లద్దాఖ్‌, కశ్మీర్‌లుగా విభజించడం. తద్వారా మూడు ప్రాంతాలను వేర్వేరు పాలన యూనిట్లుగా చేసి వాటికి నిధులు కేటాయించి అభివృద్ధి చేసేందుకు వీలవుతుంది. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని కశ్మీర్​ ప్రాంతానికే పరిమితం చేసే వీలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా కశ్మీర్​ నియంత్రణ కేంద్రం చేతిలోకి వస్తుంది.

పరిణామాలు: కశ్మీర్‌పై కేంద్రం పూర్తి పెత్తనాన్ని, రాష్ట్రాన్ని మూడుగా విభజించడాన్ని స్థానికులు, రాష్ట్ర రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించొచ్చు.

'ప్రత్యేక' తొలగింపు

జమ్ముకశ్మీర్​కు ప్రతేక హక్కులను కల్పిస్తున్నాయి అధికరణలు 35ఏ, 370. వీటి ద్వారా దేశమంతా ఒక రకమైన రాజ్యాంగం హక్కులు ఉంటే.. కశ్మీర్​లో మాత్రం వేరుగా ఉంటాయి. పార్లమెంటులో చేసే చట్టాలు ఇక్కడ అడ్డుకుంటున్నదే ఆర్టికల్ 370. కశ్మీరీల స్థానికతలను తెలిపేదే ఆర్టికల్ 35ఏ. ఈ రెండింటిని రద్దు చేస్తే.. జమ్ముకశ్మీర్ దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే మారిపోతుంది.

పరిణామాలు: ఒకవేళ అదే జరిగితే.. అక్కడి ప్రజలు.. రాజకీయ పార్టీలు తీవ్రంగా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాయి. హింసాత్మకంగా వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించొచ్చు.

పీఓకేను తిరిగి పొందడం

కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)పై దాడి చేయడం. భారత్ గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం. దీని ద్వారా నియంత్రణ రేఖ వెంబడి భారత్​కు పట్టు లభిస్తుంది. ఫలితంగా పాక్ ఉగ్రవాదాన్ని అరికట్టే అవకాశం ఉంది.

పరిణామాలు: పీవోకేపైకి దాడికి ప్రయత్నిస్తే.. అది భారత్​-పాక్ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. రెండు దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తొచ్చు.

ఎన్నికలు నిర్వహించడం

జమ్ముకశ్మీర్లో పీడీపీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వ ప్రయోగం ఎక్కువ కాలం నిలువలేకపోయింది. ఈ కారణంగా గత జూన్​ నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. ఇందులో భాగంగా అక్కడ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. అయితే ఎన్నికలను అడ్డుకునేందుకు మిలిటెంట్లు దాడికి యత్నించొచ్చని..వారిని అడ్డుకునేందుకే అదనపు బలగాల మోహరింపు అనే వాదన ఉంది.

పరిణామాలు: కల్లోలిత కశ్మీర్‌ లోయలో ఎన్నికల నిర్వహణకు స్థానిక యువత ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. పైపెచ్చు భాజపా ప్రాబల్యం జమ్ము, లద్దాఖ్‌ ప్రాంతాలకే పరిమితం కాబట్టి.. అత్యధిక స్థానాలు(46) ఉన్న కశ్మీర్‌ లోయలో కాషాయ పార్టీ పైచేయి సాధించలేదు. అప్పుడు తిరిగి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటే అనివార్యమవుతుంది.

రాష్ట్రమంతా స్వాతంత్య్ర వేడుకలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మూకశ్మీర్​లోని ప్రతి పల్లెలోనూ జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్రమంతటా భారత జాతీయ భావాన్ని పెంపొందించడం దీని లక్ష్యం.

పరిణామాలు:పాకిస్థాన్‌ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న, ఇప్పటికే పాకిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తున్న కొందరు కశ్మీరీ యువత- తమ పల్లెల్లో భారత జాతీయ జెండాను ఎగురవేయడాన్ని గట్టిగా వ్యతిరేకించొచ్చు.

నియోజకవర్గాల పునర్విభజన

జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన అనేక ఏళ్లుగా నలుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలోని 87 స్థానాలకు గాను కశ్మీర్‌ ప్రాంతం నుంచి అత్యధికంగా 46 మంది సభ్యులున్నారు. జమ్ము నుంచి 37, లద్దాఖ్‌ నుంచి 4 అసెంబ్లీ స్థానాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మూడు ప్రాంతాల్లోని సీట్లను సమం చేసినా, లేదా జమ్ము, లద్దాఖ్‌లలో సీట్ల సంఖ్యను పెంచినా.. భాజపా పైచేయి సాధిస్తుంది.

పరిణామాలు: పునర్విభజన జరిగితే కశ్మీర్‌ కేంద్రంగా కొనసాగే రాజకీయాలు అంతమవుతాయి. లోయలో ముస్లింలు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న పార్టీలు ప్రాధాన్యం కోల్పోతాయి. ముఖ్యంగా ఫరూక్‌ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాల ప్రాబల్యం తగ్గిపోతుంది. అధికార కేంద్రం జమ్ము, లద్దాఖ్‌ల వైపు మళ్లుతుంది. దీనిని స్థానిక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అయితే 2026 దాకా నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేదు.

పటిష్ఠ భద్రత

పాలనా యంత్రాంగాన్ని పటిష్ఠ పరచి, రాష్ట్రంలో భద్రతను బలోపేతం చేయాలని కేంద్రం యోచిస్తోంది.

పరిణామాలు: భారత సైన్యాన్ని రాష్ట్రంలోని అన్ని మూలల్లోనూ మోహరిస్తుండడాన్ని స్థానికులు హర్షించడం లేదు. పల్లెల్లోకి ప్రవేశం పేరిట సైన్యం మరింతగా తమ జీవితాల్లోకి చొచ్చుకొస్తుందన్న ఆందోళన వారిలో ఉంది.

ఇదీ చూడండి: నేడు కేబినెట్​ భేటీ.. కశ్మీర్​పైనే కీలక నిర్ణయాలా...?

Last Updated : Aug 5, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details