తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్'పై గతంలో ఐరాస ఏం చేసింది? ఇప్పుడేం చేస్తుంది?

కశ్మీర్​ అంశం... భారత్​-పాకిస్థాన్​ మధ్య ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న వివాదం. గతంలో ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నా ప్రయత్నాలు సఫలమవ్వలేదు. 1948-71 మధ్య కాలంలో కశ్మీర్​ అంశంపైనే 23 తీర్మానాలు చేసింది ఐరాస భద్రతా మండలి. ఈ సెప్టెంబర్​ 27న ఇరు దేశాల ప్రధానులు ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న తరుణంలో మరోసారి కశ్మీర్​ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. గతంలో వెనక్కితగ్గిన ఐరాస.. మళ్లీ జోక్యం చేసుకుంటుందా అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్​ అంశంపై ఐరాస గతంలో ఏం చేసిందనేది ఈ సందర్భంగా ఓ సారి పరిశీలిద్దాం.

'కశ్మీర్'పై గతంలో ఐరాస ఏం చేసింది? ఇప్పుడేం చేస్తుంది?

By

Published : Sep 25, 2019, 7:24 AM IST

Updated : Oct 1, 2019, 10:27 PM IST

'కశ్మీర్'పై గతంలో ఐరాస ఏం చేసింది? ఇప్పుడేం చేస్తుంది?

కశ్మీర్​కు ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు అనంతరం.. భారత్​, పాక్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. భారత్​ ఎప్పుడూ ఇది తమ అంతర్గత విషయం అని చెబుతున్నా.. పాకిస్థాన్ ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నిస్తోంది.

అయితే.. ఇప్పుడు కశ్మీర్​ అంశం కీలక దశకు చేరుకుంది. ఐక్యరాజ్యసమితిలో భారత్​, పాకిస్థాన్​ ఈ విషయంపై ముఖాముఖి తలపడే అవకాశముందని భావిస్తున్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, ఇమ్రాన్​ ఖాన్​ ఐరాస సర్వసభ్య సమావేశంలో సెప్టెంబర్​ 27న ప్రసంగించనున్నారు.

ఐరాసలో 23 తీర్మానాలు

1948-71 మధ్యలో ఐరాస భద్రతా మండలి... కశ్మీర్​పై 23 తీర్మానాలు చేసింది. కశ్మీర్​ వివాదంపై పరిష్కారం, మధ్యవర్తిత్వమే లక్ష్యంగా వీటిని ఆమోదించింది.

1948 జనవరి 1: తొలి ఫిర్యాదు

1948 జనవరి 1న ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్​లో ఆదివాసీల దండయాత్రకు పాకిస్థాన్​ సహకరించిందని ఆరోపిస్తూ యూఎన్​ చార్టర్​లోని ఛాప్టర్​ VI కింద భారత్​ మొదటగా ఐరాసలో ఫిర్యాదు చేసింది.

అప్పటి మహారాజు హరి సింగ్​ జమ్ము కశ్మీర్​ రాచరిక రాష్ట్రాన్ని భారతదేశానికి చెందినట్లుగా ఒప్పందంపై సంతకం చేసినట్లు భారత్​ బలంగా వాదించింది. అయితే భారత్​ ఆరోపణల్ని పాక్​ ఖండించింది. కశ్మీర్​ను భారతదేశం స్వాధీనం చేసుకుందని నిందించింది.

1948, జనవరి 17:

1948 జనవరి 17న ఐరాస భద్రతా మండలి తీర్మానం 38ని ఆమోదించింది. ఇదే కశ్మీర్​ అంశంపై మొదటి తీర్మానం. భారత్​, పాకిస్థాన్​ ఉద్రిక్తతలు పెంచుకోకుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. మధ్యవర్తిత్వం కోసం యూఎన్​ కమిషన్​ నియామకానికి ఇరువర్గాలు అంగీకరించాయి.

1948, జనవరి 20:

ఐరాస భద్రతా మండలి తీర్మానం 39ని ఆమోదించింది. భారత్​, పాకిస్థాన్​ మధ్య కశ్మీర్​ వివాదంపై విచారణ, పరిష్కారానికై మధ్యవర్తిత్వం కోసం ముగ్గురు సభ్యులతో యూఎన్​ కమిషన్​ను నియమించింది.

1948, ఏప్రిల్​ 21:

బ్రిటన్​, అమెరికా నేతృత్వంలోని ఐరాస భద్రతా మండలి కశ్మీర్​పై 1948 ఏప్రిల్​ 21న తీర్మానం 47ను ఆమోదించింది. యూఎన్​ కమిషన్​ సభ్యుల్ని 3 నుంచి 5కు పెంచుతూ నిర్ణయించింది. పాక్​ వారి దళాల్ని ఉపసంహరించుకోవాలని తీర్మానం ఉద్దేశం. శరణార్థుల్ని వెనక్కి పంపించడం, రాజకీయ ఖైదీల విడుదల, ఐరాస పర్యవేక్షణలో జమ్మూ ప్రజాభిప్రాయ సేకరణ, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం స్వల్పంగా దళాల్ని మోహరించేందుకు భారత్​కు అనుమతినిచ్చింది.

1949:

కాల్పుల విరమణ ప్రణాళికను ఇరు దేశాలు అంగీకరించాయి. 1949 జనవరి 1 నుంచి కాల్పుల విరమణను పర్యవేక్షించడానికి ఐరాసకు అనుమతి లభించింది.
ప్రజాభిప్రాయ సేకరణను భారత్​ ప్రభావితం చేయొచ్చనే పాకిస్థాన్​ భయాలతో.. ​1949 జనవరి 5న ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా నిర్వాహకుడి నియంత్రణలో జమ్ముకశ్మీర్​ ఉండేలా ఐరాస ప్రతిపాదించింది.

1949 డిసెంబర్​లో భారత్​, పాకిస్థాన్​ల మధ్య మధ్యవర్తిత్వం వహించబోయి యూఎన్​ఎస్​సీ ప్రెసిడెంట్​ జనరల్​ ఏజీఎల్​ మెక్​నాటన్​ విఫలమయ్యారు. వెంటనే సైన్యాలను ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం.. భారత్​, పాకిస్థాన్​ మధ్య యూఎన్​ కమిషన్​ సభ్యుడిగా ఐరాస ప్రతినిధి ఓవెన్​ డిక్సెన్​ను మాత్రమే ఉండేలా 1950లో నిర్ణయించింది. భారత్​, పాక్​లు సైన్యాన్ని తొలగించేలా జరిగిన ఒప్పందంపై ఎలాంటి పురోగతి కనిపించేలా ఆశల్లేవని తేల్చారు.

కశ్మీర్​ లోయలో ప్రాంతాల వారీగా లేదా కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లో మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ప్రతిపాదించారు డిక్సెన్​. అయితే.. భారత్​, పాకిస్థాన్​ డిక్సెన్​ ప్రతిపాదనలపై ఒక ఒప్పందానికి రాలేదు.

డిక్సెన్​ తర్వాత.. ఫ్రాంక్​ గ్రాహం, గున్నార్​ జారింగ్​లు కూడా ఇరు దేశాల్ని ఒక అంగీకారానికి రప్పించేలా చేయడంలో విఫలమయ్యారు.

భారత్​, పాకిస్థాన్​ మధ్య యూఎన్​ కమిషన్​ గడువు ముగిసిన నేపథ్యంలో... ఐరాస 1951 మార్చి 30న తీర్మానం 91ను ఆమోదించింది. భారత్​, పాక్​ మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించేలా ఐరాస సైనిక బృందం ఏర్పాటుకు దారితీసింది. దీనినే ఇప్పుడు నియంత్రణ రేఖ అంటున్నారు.

1956 యుద్ధం తర్వాత..

60వ దశకంలో పాకిస్థాన్​ ఎల్లవేళలా కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తినప్పటికీ.. 1965 భారత్​-పాక్​ యుద్ధం అనంతరం ఈ వివాదంలో ఐరాస జోక్యం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది.
అమెరికా, సోవియట్​ యూనియన్​ తీవ్రమైన ఒత్తిడితో.. భారత్​, పాకిస్థాన్​ ఐరాస ఆధ్వర్యంలో కాల్పుల విరమణను పాటించేలా 1965, సెప్టెంబర్​ 29న అంగీకరించాయి.

చివరి తీర్మానం..

కశ్మీర్​కు సంబంధించిన చివరి తీర్మానం కాల్పుల విరమణకు డిమాండ్​. 1971 బంగ్లాదేశ్​ యుద్ధం నేపథ్యంలో దీనిని ఆమోదించారు. ఇది సిమ్లా ఒప్పందానికి దారి తీసింది.
కశ్మీర్​ అంశంలో భారత్​.. ఇప్పటికీ సిమ్లా ఒప్పందాన్నే పాటిస్తోంది. అంతకుముందు ఐరాస చేసిన తీర్మానాలన్నింటినీ సిమ్లా ఒప్పందం అధిగమిస్తుందని వాదిస్తోంది భారత్​. ద్వైపాక్షికంగానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటోంది. అయితే.. పాకిస్థాన్​ మాత్రం ఒప్పందానికి అంగీకరించినా.. ఐరాస ప్రమేయం కోరుకుంటోంది.

ఇదీ చూడండి:పాకిస్థాన్​లో భూకంపం- ఒకరు మృతి, 50 మందికి గాయాలు

Last Updated : Oct 1, 2019, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details