తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్ర మృతి - Somen Mitra

బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్ర కన్నుమూశారు. గురువారం రాత్రి 1.30 గంటలకు గుండెపోటుతో కోల్​కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చివరి శ్వాస విడిచారు. కొన్నేళ్లుగా బంగాల్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉన్నారు మిత్ర. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. ఓసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

West Bengal Congress president Somen Mitra dies at 78
బంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్ మిత్ర మృతి

By

Published : Jul 30, 2020, 7:59 AM IST

బంగాల్​ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమెన్​ మిత్ర(78) కన్ను మూశారు. కొద్ది రోజులుగా గుండె, వయసు సంబంధిత వ్యాధులకు చికిత్స పొందుతున్న మిత్ర... గురువారం రాత్రి 1.30 గంటలకు కోల్​కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడం వల్లే మిత్ర మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు స్పష్టం చేశాయి.

"ఆయన శరీరంలో క్రియాటినైన్ స్థాయి అధికంగా ఉన్నట్లు రొటీన్ చెకప్ సమయంలో తెలిసింది. అనంతరం ఆయన ఆస్పత్రిలో చేరారు. క్రోనిక్ అబ్​స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీఓపీడీ) వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఇతర వయసు సంబంధిత వ్యాధులు సైతం ఉన్నాయి."

-ఆస్పత్రి సీనియర్ అధికారి

కొద్ది రోజుల క్రితం సాధారణ చెకప్ కోసం మిత్రను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లోక్​సభ ఎంపీగా ఉన్నప్పుడు ఇది వరకే ఓసారి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు మిత్ర.

నేతల సంతాపం

మిత్రా మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. లక్షల మంది జీవితాలపై ఆయన ప్రభావం ఉంటుందని ఏఐసీసీ పశ్చిమ బంగ ఇంఛార్జీ గౌరవ్ గొగొయి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాజకీయ ప్రస్థానం..

ప్రజా జీవితంలో ఛోరడా(తమ్ముడు)గా ప్రసిద్ధి చెందిన మిత్రా.. 1960-70లలోని దూకుడైన రాజకీయవేత్తగా పేరు గాంచారు. విద్యార్థి రాజకీయాల ద్వారా కాంగ్రెస్​లోకి అడుగుపెట్టారు. పశ్చిమ బంగ కాంగ్రెస్​కు మూడు సార్లు అధ్యక్షుడిగా సేవలందించారు. సీల్డా నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2008లో కాంగ్రెస్​తో విభేదించి ప్రగతిశీల్ ఇందిరా కాంగ్రెస్​ పార్టీని నెలకొల్పారు. 2009 లోక్​సభ ఎన్నికలకు ముందు పార్టీని తృణమూల్ కాంగ్రెస్​లో విలీనం చేశారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ టికెట్​తో డైమండ్ హార్బర్ లోక్​సభ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో టీఎంసీకి గుడ్​బై చెప్పి.. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు మిత్ర. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐ(ఎం), కాంగ్రెస్​ పార్టీల మధ్య పొత్తు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి:ఆర్టికల్ 370 రద్దుతో ఉగ్రవాదానికి కళ్లెం

ABOUT THE AUTHOR

...view details