ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక ఘట్టానికి కొన్ని గంటల ముందు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ ప్రయోగం దేశంలోనే తొలిసారి అయితే భాజపా అధికారంలోకి రాకముందు ఇలాంటివి చేపట్టలేదా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక మాంద్యంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసిన ప్రయత్నమని ఆరోపించారు.
పశ్చిమ బంగ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన మీడియా, న్యాయవ్యవస్థ వంటివి కేంద్రం సలహాలతో నడుస్తున్నాయని ఆరోపించారు.
ఆర్థిక మాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటలను తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు మమత. రాజకీయ విమర్శల కంటే ఆర్థిక వ్యవస్థపై ఎక్కవ దృష్టిసారించాలన్నారు.
ఎన్ఆర్సీని అనుమతించం..
అసోం మాదిరి జాతీయ పౌర రిజిస్టర్ను పశ్చిమ బంగలో చేపడతామన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు మమత. రాష్ట్రంలో ఎన్ఆర్సీని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ అమలు చేయటం అనేది భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రాజకీయ వ్యూహమని ఆరోపించారు. అసోం ఎన్ఆర్సీలో నిజమైన భారతీయులకు చోటు దక్కలేదని విమర్శించారు.