కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు మద్దతిస్తున్న రైతు సంఘాలను నేరుగా వెళ్లి కలుస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికైత్ తెలిపారు. కొత్త చట్టాలతో వారు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో స్వయంగా అడిగి తెలుసుకుంటామన్నారు. పంటను విక్రయించేందుకు ఉపయోగిస్తున్న సాంకేతికతను వారి నుంచే నేర్చుకుంటామని చెప్పారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో వివిధ రైతు సంఘాలు నాలుగు వారాలుగా ఆందోళనలు చేస్తున్నాయి. అయితే హింద్ మజ్దూర్ కిసాన్ సమితి వంటి పలు సంఘాలు మాత్రం కొత్త సాగు చట్టాలకు మద్దతు ప్రకటించాయి. ఇవి రైతులకు ఉపయోగకరమని చెబుతున్నాయి.