కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. డిసెంబర్ 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. దేశవ్యాప్తంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించినట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఆందోళనలు ముందుకు తీసుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దిల్లీలోని ఇతర ప్రధాన మార్గాలనూ నిర్బంధించనున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 5న జరగనున్న చర్చల్లో కేంద్రం.. తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దిల్లీ-హరియాణాలోని సింఘూ సరిహద్దు వద్ద నిరసనలు చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతలు.. ఈ మేరకు తీర్మానించారు.
''వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలని మేం నిన్న ప్రభుత్వానికి తేల్చిచెప్పాం. డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తాం. డిసెంబర్ 8న భారత్ బంద్కు పిలుపునిస్తున్నాం. మేం ఆందోళనలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం.''
- హెచ్ఎస్ లాఖావాల్, భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి