కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉందని, రన్‌వేకు ఇరువైపులా లోయలున్నాయని వారు గుర్తుచేశారు. దీనికి తోడు లైటింగ్ కూడా ఎక్కువగా ఉండదని చెప్పారు. ఈ విషయమై గతంలోనే తాము అనేకసార్లు సంబంధిత అధికార వర్గాలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.
అదే జరిగివుంటే.?
విమానం రన్‌వే చివరకు వెళ్లి రెండు ముక్కలుగా విడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మంటలు రాలేదు. ఒక వేళ మంటలు ఏర్పడివుంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువగా ఉండేది. 2010లో మంగళూరు విమానాశ్రయంలో ఇదే తరహా ప్రమాదం జరగ్గా మంటలు రావడం వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. విమానాలు రన్‌వేలపై దిగే సమయంలో టైర్లలోని కొన్ని రబ్బరు శకలాలు కిందపడుతుంటాయి. వర్షంతో ఇవి రన్‌వేను మరింత జారుడుగా మారుస్తాయి. కోజికోడ్ విమానాశ్రయంలో భారీ వర్షంతో రన్‌వే మరింత జారుడుగా మారింది. దీనితో పాటు రన్‌వే ఏటవాలుగా ఉండటం వల్ల విమానం జారిపోయివుండవచ్చని విమానయాన నిపుణులు అభిప్రాయపడ్డారు.