తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లను అనుమతిస్తూ ఆదేశాలివ్వాలన్న తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మేం క్రికెట్‌ను పర్యవేక్షించలేమని వ్యాఖ్యానించింది. తమిళ క్రికెట్ బోర్డు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ను లేదా అమికస్ క్యూరీ(కేసులో కోర్టుకు సహాయపడే నిష్పక్షపాత సలహాదారు) వద్ద ఈ అంశాన్ని లేవనెత్తాలని జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ బీ ఆర్ గవాయి ధర్మాసనం అభిప్రాయపడింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తమిళ నాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించారు. ఈ అంశమై తమిళనాడు ప్రీమియర్ లీగ్ పాలకమండలిని సంప్రదించారా అని ధర్మాసనం పిటిషనరు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సమాధానంగా పాలక మండలి వద్ద ఈ అంశాన్ని మే నెలలోనే లేవనెత్తామని, కానీ వారు ఏ నిర్ణయమూ తీసుకోలేదని కోర్టుకు వెల్లడించారు.
బీసీసీఐ నూతన నిబంధనలకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సహకరించడం లేదని పాలకమండలి తరఫున సీనియర్ న్యాయవాది పరాగ్ త్రిపాఠి వాదనలు వినిపించారు.