బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరారు భాజపా నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని ఆరోపించారు. ఇటీవల భాజపా ఎమ్మెల్యే అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతితో మంగళవారం భేటీ అయి, వినతి పత్రం సమర్పించారు.
రాష్ట్రపతికి సమర్పించిన లేఖ రాష్ట్రపతిని కలిసిన భాజపా నాయకులు కోవింద్‌ను కలిసిన వారిలో భాజపా ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ, పార్టీ ఎంపీ రాజు బిస్తా, రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తా తదితరులు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న రాజకీయ హత్యల్లో భాగంగానే దేబేంద్రనాథ్ రే 'హత్య' కూడా జరిగిందని ఆరోపించారు.
"బంగాల్లో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఇప్పటి వరకు రాజకీయ కార్యకర్తలను బలిగొన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులనూ హత్య చేసి.. ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కు లేదు. వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం."
-కైలాస్ విజయవర్గీయ, భాజపా ప్రధాన కార్యదర్శి.
రాష్ట్రంలో గడచిన మూడేళ్లలో భాజపాతో సంబంధం ఉన్న 105 మంది హత్యకు గురైనట్లు కైలాస్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేసేందుకు రాష్ట్ర పోలీసులు, ఇతర ప్రభుత్వ సంస్థల అధికారులను పావులుగా ఉపయోగించుకుంటున్నారని పార్టీ ఎంపీ బిస్తా విమర్శించారు. ఎమ్మెల్యే హత్య కేసులో నిజానిజాలు తేలాలంటే సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
పంచనామా నివేదిక...
ఆత్మహత్య చేసుకోవడం వల్లే దేబేంద్రనాథ్ మృతి చెందారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. శరీరం మీద ఎలాంటి గాయాలులేనట్లు వెల్లడైంది. ఎమ్మెల్యే జేబులో సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన చావుకు ఇద్దరు వ్యక్తులు కారణమని అందులో ఉన్నట్లు వెల్లడించారు.
బంగాల్లోని ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లా హెమ్తాబాద్ భాజపా ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రే సోమవారం అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. బిందాల్ గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఆయన ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. సీపీఎం టికెట్‌పై హెమ్తాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు సదరు ఎమ్మెల్యే. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత గతేడాదే భాజపాలోకి చేరారు.
ఇదీ చూడండి:75 మంది భాజపా నేతలకు కరోనా