తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​: చర్చలు సఫలం- వైద్యుల సమ్మె విరమణ - సమ్మె

బంగాల్లో వారం రోజులుగా జరుగుతున్న వైద్యుల ఆందోళనకు తెరపడింది. సీఎం మమతా బెనర్జీతో చర్చల అనంతరం ఆందోళన విరమిస్తున్నట్లు వైద్య విద్యార్థులు ప్రకటించారు. జూడాల డిమాండ్లన్నింటికి  ప్రభుత్వం సానుకూలంగా ఉందని మమత ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల భద్రత కోసం నోడల్‌ అధికారులను నియమించాలని ఆదేశించారు.

బంగాల్​: చర్చలు సఫలం- వైద్యుల సమ్మె విరమణ

By

Published : Jun 17, 2019, 7:25 PM IST

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీతో వారం రోజులుగా చేస్తోన్న ఆందోళనను జూడాలు విరమించారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 11న కోల్‌కతాలోని ఎన్​ఆర్​ఎస్ వైద్య కళాశాలలో రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వారి బంధువులు దాడి చేయడాన్ని నిరసిస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు.

ఆందోళనలు తార స్థాయికి చేరిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ విద్యార్థులతో చర్చలు జరిపారు. సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో వైద్య శాఖ సహాయ మంత్రి చంద్రిమ భట్టాచార్య, వైద్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, 31మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మీడియా సమక్షంలో ఈ భేటీ జరగాలన్న వైద్యుల డిమాండ్‌కు అంగీకరించిన ప్రభుత్వం రెండు ప్రాంతీయ ఛానళ్లను అనుమతించింది.

సరైన భద్రత లేకపోవటం వల్ల భయం భయంతో విధులు నిర్వహించాల్సి వస్తోందని జూడాలు సీఎంకు తెలిపారు. ఆందోళనకు దిగిన వైద్యులపై ఎలాంటి కేసులు పెట్టమని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. విద్యార్థి వైద్యులపై దాడికి పాల్పడిన ఐదుగుర్ని అరెస్టు చేసినట్లు చెప్పారు.

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల భద్రతకు నోడల్‌ అధికారులు సహా ఫిర్యాదు విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు దీదీ హామీ ఇచ్చారు. ఇతర డిమాండ్లకూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం వల్ల సమ్మె విరమిస్తున్నట్లు వైద్య విద్యార్థులు ప్రకటించారు. వెంటనే విధుల్లో చేరనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: దిల్లీలో డ్రైవర్​పై పోలీసుల 'మూక దాడి'!

ABOUT THE AUTHOR

...view details