తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంక్షోభం: చెన్నైలో రోగులపై 'నీటి భారం' - రోగులు

తమిళనాడులో నీటి సంక్షోభం చెన్నై ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నాయి ఆస్పత్రి యాజమాన్యాలు. ఈ భారాన్ని రోగులపై మోపుతున్నాయి. ఫలితంగా వైద్య ఖర్చులు గతంలో ఎన్నడూ లేని విధంగా తారస్థాయికి చేరుకున్నాయి.

సంక్షోభం: చెన్నైలో రోగులపై 'నీటి భారం'

By

Published : Jul 15, 2019, 4:52 AM IST

దేశంలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించే నగరంగా చెన్నైకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అత్యాధునిక వైద్య సేవలు, క్లిష్టమైన శస్త్రచికిత్సల వైద్య ఖర్చు ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ తక్కువ. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. తమిళనాడును కుదిపేస్తోన్న నీటి సంక్షోభం చెన్నై ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

వేల రూపాయలు వెచ్చించి ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నాయి ఆస్పత్రి యాజమాన్యాలు. ఈ వ్యయాన్ని రోగులపై మోపుతున్నాయి. వైద్య ఖర్చు మధ్య తరగతి ప్రజలు భరించలేని స్థాయికి చేరుకుంది. ఫలితంగా వైద్యసేవలో చెన్నైకు ఉన్న పేరు క్రమంగా మసకబారుతోంది.

నీరే ఆధారం

ఆసుపత్రిలో ప్రతి చికిత్సకు నీరు అవసరమని వైద్యులు చెబుతున్నారు.

'ఆసుపత్రిని, వైద్య పరికారాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలి. ప్రైవేటు ఆసుపత్రులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి.. ఆ మొత్తాన్ని రోగుల నుంచి వసూలు చేస్తున్నాయి. వైద్య ఖర్చు పెరిగినా కొన్నిసార్లు చికిత్స అందించలేకపోవచ్చు. నీటి సంక్షోభం ఇలాగే కొనసాగితే చాలా ఆసుపత్రులు మూతపడే పరిస్థితి ఉంది.'
-డా. రవీంద్రనాథ్​, చెన్నై

నీటి ధరకు రెక్కలు..

వర్షాలు లేక చెన్నైలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నగరానికి 100 కి.మీ దూరం నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు ప్రైవేటు వ్యాపారులు. డిమాండ్​ బాగా పెరిగినందు వల్ల ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వీరి నుంచి నీటిని కోనుగోలు చేస్తున్నాయి ఆసుపత్రుల యాజమాన్యాలు.

30 పడకలున్న ఆసుపత్రికి రోజుకు కనీసం 12 వేల లీటర్ల నీరు అవసరం. ఇందుకోసం రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చవుతోంది. 500 పడకలున్న పెద్ద ఆసుపత్రులకు రోజుకు 80 వేల లీటర్ల అవరమవుతుంది. నీటి వ్యయం అధికమవుతుంది.

"ప్రభుత్వం నీటి సరఫరా ఏర్పాట్లు సరిగా చేయలేదు. సమయానికి ట్యాంకర్లు రావు. ఒకవేళ వచ్చినా ఆ నీరు అవసరానికి సరిపోదు. రోగుల సంఖ్యను బట్టి నీటి వినియోగం ఉంటుంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో బోరుబావులు ఉన్నా.. తక్కువ నీరే అందుబాటులో ఉంది."
- డా. ముత్తురాజ్​, భారతీయ వైద్య సంఘం కార్యనిర్వహణాధికారి.

వేల రూపాయలు వెచ్చించినా... నీరు పరిశుభ్రంగా లేకపోవడం మరో ఆందోళనకరాంశం. ఏమాత్రం తేడా వచ్చిన రోగుల ఆరోగ్యం మరింత విషమించే ప్రమాదముందన్నది వైద్యుల ఆందోళన.
నీరు దొరకనందు వల్లే అధిక ధరలు

చెన్నై సమీప జిల్లాలు కాంచీపురం, తిరువళ్లూర్​లో ఇరిగేషన్​ బావుల నుంచి నీరు తోడి సరఫరా చేస్తున్నట్లు ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతాల్లోనూ నీరు దొరకదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వం జోక్యం అవసరం

ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రైవేటు ట్యాంకర్లు తక్కువ ధరకే నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details