తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సమయాన్ని వృథా చేశారు- ఫలితమే 20 మంది మృతి' - కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

భారత్​-చైనా సరిహద్దు వివాదంపై జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. మోదీ సర్కార్​పై తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు పరిస్థితులను తెలియజేయడంలో నిఘా వర్గాలు విఫలమయ్యాయా అని ప్రశ్నించారు. 20 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Was there intelligence failure on situation along LAC with China: Sonia asks govt at all-party meet
సరిహద్దు పరిస్థితులపై ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా?

By

Published : Jun 19, 2020, 10:15 PM IST

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్​- చైనా సరిహద్దు వివాదంపై జరిగిన అఖిలపక్ష భేటీలో పాల్గొన్న ఆమె.. సరిహద్దు పరిస్థితులపై ముందస్తు హెచ్చరికలు చేయడంలో నిఘా వైఫల్యం ఏమైనా ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గల్వాన్​ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సమయం వృథా చేశారు...

చైనా దళాలు తూర్పు లద్దాక్​ గల్వాన్ లోయ వద్ద సరిహద్దులు దాటుతుంటే.. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించలేదా? అని సోనియా గాంధీ ప్రశ్నించారు. మే 5 నుంచి జూన్ 6 వరకు గల విలువైన సమయాన్ని ప్రభుత్వం వృథా చేసిందని.. ఫలితంగానే 20 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.

దేశానికి హామీ కావాలి..

"వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితి పునరుద్ధరణ జరుగుతుందని, చైనా బలగాలు మన భూభాగం వీడి వెనక్కి మళ్లుతాయనే హామీని... ప్రభుత్వం నుంచి దేశం కోరుకుంటోంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

మౌంటైన్​ స్ట్రైక్ కార్ప్స్ పరిస్థితి ఏంటి?

అఖిలపక్ష భేటీలో మౌంటైన్​ స్ట్రైక్ కార్ప్స్​ గురించి కూడా సోనియా గాంధీ ప్రస్తావించారు. 2013లో ఏర్పరిచిన రెండు పర్వత పదాతిదళ విభాగాల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వీటికి సరైన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడంలేదో తెలపాలన్నారు.

ఇదీ చూడండి:పాక్ కుట్ర భగ్నం- ఇద్దరు ఖలిస్థాన్ ఉగ్రవాదులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details