పుల్వామా ఉగ్రదాడి... భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఘటన.. జాతీయ రాజకీయాలనూ వేడెక్కిస్తోంది. ఉగ్రదాడికి ప్రతిగా భారత్ నిర్వహించిన మెరుపుదాడిపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అంతే దీటుగా ఎదురుదాడి చేస్తోంది అధికార పక్షం.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ పుల్వామా దాడికి సంబంధించి చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది.
"పుల్వామా దుర్ఘటన తర్వాత మన వాయుసేన చేసిన దాడులపై విదేశీ మీడియా సందేహాలు వ్యక్తం చేస్తోంది. అంటే ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతనూ ప్రశ్నించినట్టే"
-దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత
భాజపా ఎదురుదాడి
దిగ్విజయ్ ట్వీట్‌ను భాజపా తప్పుబట్టింది. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి అయితే... దుర్ఘటన అనడం ఏంటని ప్రశ్నించింది.