భారత్ పొరుగు దేశాలైన మాల్దీవులు, శ్రీలంకల్లో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు మాల్దీవులకు వెళ్లనున్నారు ప్రధాని... అనంతరం ఆదివారం శ్రీలంకలోనూ పర్యటిస్తారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి విదేశీ పర్యటనగా భారత్ పొరుగుదేశాలనే ఎన్నుకున్నారు మోదీ. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలకే భారత్ తొలి ప్రాధాన్యమిస్తుందన్న విధానానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు. తనను మాల్దీవులకు ఆహ్వానించినందుకు ఆ దేశాధ్యక్షునికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
" జూన్ 8,9 తేదీల్లో మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నాను. పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యమనే విధానానికి భారత్ కట్టుబడి ఉందనడానికి ఇదో సంకేతంగా నిలుస్తుంది. పొరుగు తీర దేశాలతో భారత్ సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తాం."
- నరేంద్రమోదీ, ప్రధాని
పొరుగు దేశంలో జరిగిన బాంబు దాడుల బాధితులకు భారత ప్రజలు అండగా ఉంటారని మోదీ స్పష్టం చేశారు.