చైనా ఏకపక్ష ధోరణితో... తూర్పు లద్దాక్ గాల్వన్ లోయ వద్ద సరిహద్దు పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించిందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగిందని స్పష్టం చేసింది.
లద్దాక్‌లో జరిగిన ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగశాఖ పేర్కొంది. అనుకున్న విధంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించి ఉంటే.. ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది.
"సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోంది. అలాగే భారత్ తన సార్వభౌమాధికారం నిలబెట్టుకునే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు."
- భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ
హద్దు దాటరాదు..
'సరిహద్దు నిర్వహణ విషయంలో.. భారత్ ఎలాంటి చర్య చేపట్టినా.. అది వాస్తవాధీన రేఖ వెలుపలే ఉంటుంది. చైనా కూడా ఇలానే ఉండాలని భారత్ కోరుకుంటోంది' భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
గాల్వన్పై సార్వభౌమాధికారం మాదే
మరోవైపు భారత సైనికులే సరిహద్దులు దాటారంటూ చైనా ఆరోపించింది. గాల్వన్పై చైనాకే సార్వభౌమాధికారం ఉందని బరితెగించి చెబుతోంది. ఘర్షణలో తమ సైనికుల ప్రాణాలూ పోయాయని వెల్లడించింది.
రాజ్‌నాథ్ సింగ్ వరుస భేటీలు
వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస భేటీలు నిర్వహించారు. మొదట త్రివిధ దళాధిపతులు, విదేశాంగమంత్రి జైశంకర్‌తో సమావేశమైన ఆయన సరిహద్దు పరిస్థితులను సమీక్షించారు. తరువాత ప్రధాని మోదీతో భేటీ అయ్యి భారత్-చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణ గురించి వివరించారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు.
ముగ్గురు భారత జవానులు మృతి
సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో... భారత్‌కు చెందిన ఓ కమాండింగ్ అధికారి, మరో ఇద్దరు జవానులు వీర మరణం పొందారు. ఈ ఘటనలో పలువురు చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 1975 తరువాత ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి. ఈ ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు ఇరుదేశాల సైన్యాధికారులు చర్చలు జరుపుతున్నట్లు భారత సైన్యం తెలిపింది.
ఇదీ చూడండి:పరిస్థితిని మరింత దిగజారనీయొద్దు: చైనా హెచ్చరిక