గ్రామీణ భారతానికి కరోనా మహమ్మారి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. వలస కార్మికుల చేరవేతను అనుమతించడం సహా వివిధ సడలింపులను ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దేశానికి ఇదే పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. నెమ్మదిగానైనా దేశంలో అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయనేది వాస్తవమని, రాబోయే రోజుల్లో ఇవి క్రమేపీ ఊపందుకునేలా సమతౌల్య వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. దీనిపై ఈ నెల 15 నాటికి బ్లూప్రింట్ ఇవ్వాలని సూచించారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రులతో మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించాలా, సడలించాలా అనే విషయమై సవివరంగా మాట్లాడారు. కరోనా లేని ప్రాంతాల్లోనైనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం సుమారు 6గంటలపాటు కొనసాగింది. ఈసారి ఎక్కువమందికి మాట్లాడే అవకాశం లభించింది.
సూచనలు కావాలి...
ఇప్పటి చర్యలు తదుపరి దశలో అవసరం లేదు. ‘తొలి లాక్‌డౌన్‌లో తీసుకున్న చర్యలు రెండో దశలో అవసరం లేదు. రెండో దశనాటి చర్యలు మూడో దశలో అవసరం లేదు. ఇప్పుడు మూడో దశలో తీసుకున్న చర్యలు నాలుగో దశలో అవసరం లేదన్నది నా స్పష్టమైన అభిప్రాయం’’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఎలా నిర్వహించాలనుకుంటున్నదీ ఒక స్థూల ప్రణాళికను సీఎంలు పంపాలని చెప్పారు. లాక్‌డౌన్‌తోపాటు, దాన్ని క్రమంగా ఎత్తేసిన తర్వాత వచ్చే చిన్నచిన్న సమస్యలను ఎలా అధిగమించాలనుకుంటున్నారో వివరాలు పంపాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ కోసమే రైళ్లు ప్రారంభించామని, మున్ముందు అన్ని రూట్లలో కాకుండా కేవలం ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే వీటిని నడుపుతామని స్పష్టం చేశారు. ఇకముందూ లాక్‌డౌన్ కొనసాగుతుందని, అయితే మరిన్ని వెసులుబాట్లు ఉంటాయని సంకేతాన్ని ఇచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలను అనుమతించాలా, వద్దా అనే విషయం నుంచి రాష్ట్రాలకు వదిలిపెట్టాల్సిన నిర్ణయాల వరకు అనేకాంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. కరోనాపై పోరాటంలో రాష్ట్రాలు పోషిస్తున్న పాత్రను ప్రధాని కొనియాడారు. మహమ్మారి నుంచి భారత్ తనను తాను విజయవంతంగా కాపాడుకోగలుగుతోందనే భావన యావత్ ప్రపంచం నుంచి వ్యక్తమవుతోందని ఆయన చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
జయించి తీరాలి...