జమ్ము కశ్మీర్లో పరిస్థితులపై చర్చించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ఆ రాష్ట్రంలోని సర్పంచ్‌లు దిల్లీలో సమావేశమయ్యారు. అక్కడి క్షేత్ర స్థాయి సమస్యలపై ఆయనతో చర్చించి వాటిని పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు తొందరగా అదుపులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
"వచ్చేది పండ్ల సీజన్. ఈ విషయంలోనే మా చింత. ఈ పరిస్థితుల్లో కశ్మీర్ నుంచి పండ్లను ఎలా ఎగుమతి చెయ్యాలి? ఇది సాధ్యం కాకపోతే కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. మా సమస్యలన్నీ విన్నవించగా.. ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు. మిగతా రాష్ట్రాల మాదిరిగానే మా గ్రామాలు అభివృద్ధి చెందేలా పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం సంతోషంగా ఉంది."
-సర్పంచ్
పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.
"మా ముఖ్య డిమాండ్.. 370 రద్దు తర్వాత పంచాయతీలకు బాధ్యతలు పెరగాలి. భూములపై పూర్తి స్థాయి అధికారాలు రావాలి. 73,74 అధికరణల ప్రకారం కశ్మీర్లో పంచాయతీ వ్యవస్థ బలపడుతుంది. పనులు తొందరగా పూర్తవుతాయి. నిధులు వస్తాయి. సర్పంచ్, పంచ్‌లకు ఇంకా అధికారాలు పెరిగితే గ్రామ స్థాయిలో అన్ని పనులు చేసేందుకు వీలుంటుంది."