జాతిపత మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మహాత్ముని ఆదర్శాల ఆవశ్యకతను పునరుద్ఘాటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గాంధీ చూపిన మార్గంలో నడవాలని ఈ తరం యువతకు పిలుపునిచ్చారు.
"బ్రిటిషర్ల అమానవీయ పాలన నుంచి భారతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు సాగిన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఓ దూరదృష్టితో, అహింసా సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిన జాతిపిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పిండచమే ఈ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనక ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా మహాత్ముని ఆదర్శాలైన సత్యానికి కట్టుబడి ఉండటం, అహింసను పాటించడం, శాంతి సామరస్యాలను కాపాడుకోవటం, నిజాయతీగా ఉండటం, సంయమనాన్ని పాటించడంతో పాటుగా, సామాజిక దురాచారాలైన కుల, మత వివక్ష, దురభిమానం ఏ రూపంలో ఉన్నా వాటిని రూపుమాపేందుకు అంకితభావంతో కృషిచేసే దిశగా ఓ సంకల్పాన్ని తీసుకుందాం. భిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు, భిన్న భాషలున్నప్పటికీ, స్వాతంత్ర్య సిద్ధి కోసం మనందరిలో స్ఫూర్తి రగిలించి ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో మహాత్ముడు అనుసరించిన విధానమేంటి? అని పరికించి చూస్తే, మహాత్ముడు సత్యాన్ని (సత్యాగ్రహం), శాంతిపూర్వక విధానాలను విశ్వసించారు. వీటి ద్వారానే ఎన్నో క్లిష్టమైన సమస్యలున్నా మనందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు.
మహాత్ముడి రాజనీతిజ్ఞత, దూరదృష్టి కారణంగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలకు చెందినవారిలో స్వాతంత్ర్య స్ఫూర్తి మరింత రగిలింది, చైతన్యం కలిగింది. ఆ స్ఫూర్తి, చైతన్యం కారణంగానే దేశం నలుమూలలా ఉద్యమాలు మొదలై బ్రిటిషర్లకు ఊపిరిసలపకుండా చేశాయి. గాంధీజీ లాగా వివిధ అంశాల్లో యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ప్రభావశాలి అయిన బాపు, విలువలతో కూడిన జీవితాన్ని, ఘనమైన వారసత్వాన్ని మనకు అందించారు. వారి జీవితం, సందేశం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచాయి. బ్రిటిష్ పాలననుంచి బయటపడి.. భారతదేశంలో స్వపరిపాలన, సుపరిపాలన అందించాలన్న ఏకైక లక్ష్యంతో పోరాటం చేసిన సమరయోధులను, వారి త్యాగాలను ఈ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుచేసుకుంటున్నాం.