మాజీ సైనికాధికారుల 'లేఖ'పై దుమారం రాష్ట్రపతికి 150 మంది మాజీ సైన్యాధికారుల పేరిట రాసిన ఓ లేఖ దుమారం రేపింది. సైనిక బలగాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడాన్ని తప్పుబడుతూ రాసిన ఆ లేఖపై 8 మంది మాజీ త్రివిధ దళాల సారథుల పేర్లు ఉన్నాయి.
" భారత వైమానిక దళం బాలాకోట్‌పై చేసిన వైమానిక దాడిని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. సైన్యం విషయంలో రాజకీయ పార్టీలు తీరు ఆందోళనకరంగా, కలవరపాటుకు గురిచేసేలా ఉంది. సైన్యం చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అసాధారణం. ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు.
కొంతమంది సైన్యాన్ని 'మోదీ సేన' అని సంబోధించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. రాజకీయ పార్టీల కార్యకర్తలు సైన్యం యూనిఫామ్ వేసుకోవడం, ముఖ్యంగా వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫొటోలను ప్రచారానికి వాడుకున్న చిత్రాలు మీడియాలో కనపడటం సరైంది కాదు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి."
- లేఖ సారాంశం
రాజకీయం షురూ....
లేఖ గురించి వార్త వచ్చిన కాసేపటికే విపక్షాలు భాజపాపై విమర్శలు గుప్పించాయి. సైన్యాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్న భాజపాపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
ఖండించిన రాష్ట్రపతి భవన్...
రాష్ట్రపతి భవన్ సదరు లేఖ వార్తలపై స్పందించింది. తమకు మాజీ సైనికాధికారుల నుంచి ఎలాంటి లేఖ అందలేదని స్పష్టం చేసింది.
మాకేం సంబంధం...?
లేఖపై మాజీ సైన్యాధిపతి ఎస్ఎఫ్ రోడ్రిగ్స్, మాజీ వైమానిక దళపతి ఎన్సీ సూరి పేర్లు ఉన్నాయి. అయితే ఆ లేఖతో తమకు ఎలాంటి సంబంధంలేదని వారిద్దరూ చెప్పారు.
"సైన్యంలో ఉన్నవారు ప్రభుత్వం ఏం చెబితే అది చేయాలి. మేము దేశం కోసం పనిచేసే వాళ్లం. అలాంటి మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అందుకే మమ్మల్ని రాజకీయాల్లోకి లాగకూడదు. ఎవరికి తోచింది వారు రాసుకోవచ్చు. ఆ విషయం మీకు తెలుసు. ఈ లేఖ గురించి నేను ఏం చెప్పలేను ఎందుకంటే అసలు ఈ లేఖ ఎవరు రాశారో కూడా నాకు తెలియదు."
- జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్, మాజీ సైనికాధికారి
రాశాం.. ఎందుకంటే.?
మరో మాజీ సైనికాధికారి జనరల్ శంకర్ రాయ్ చౌదురి లేఖ రాసినట్లు అంగీకరించారు.
"ఇలాంటి ముఖ్య విషయంపై మాజీ సైనికాధికారులుగా మా అభిప్రాయం తెలియజేశాం. రాష్ట్రపతికి లేఖ రాయడానికి కారణం ఆయన రాజ్యాంగ సంరక్షకులు, సాయుధ దళాలకు సుప్రీం కమాండర్."
- శంకర్ రాయ్ చౌదురి, మాజీ సైనికాధికారి
చౌదురితో పాటు మాజీ సైనిక దళాధిపతి జనరల్ దీపక్ కపూర్ సైతం లేఖపై తమ అభిప్రాయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
రంగలోకి దిగిన రక్షణమంత్రి...
లేఖపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల వేళ ఇలాంటి లేఖలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
"నేను మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఈ లేఖతో తమకు సంబంధం లేదని ఇద్దరు సీనియర్ అధికారులు ఎయిర్ మార్షల్ సూరి, జనరల్ రోడ్రిగ్స్ స్పష్టంగా చెప్పారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నకిలీ లేఖలపై సంతకాలు చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం."
-నిర్మలా సీతారామన్, రక్షణమంత్రి