ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ అధికారుల నిర్లక్యంతో ఓ ప్రైవేటు పాఠశాలకు ఏకంగా రూ.600 కోట్లకుపైగా కరెంట్ బిల్లు వచ్చింది. స్వయానా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ఈ ఘటన జరిగింది. ఊహించని విద్యుత్ ఛార్జితో పాఠశాల యజమానులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ అయింది.
షాకింగ్: పాఠశాలకు రూ.600 కోట్ల కరెంట్ బిల్
వారణాసిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు ఏకంగా రూ.600 కోట్లకు పైగా విద్యుత్ బిల్లు వచ్చింది. విషయం తెలియగానే యజమానులు కంగుతిన్నారు.
వారణాసి వినాయక్ కాలనీలోని ప్రైవేట్ పాఠశాలకు అందిన మొత్తం కరెంట్ బిల్లు అక్షరాలా రూ.618,51,50,163. ఇదే అంశంపై 'పుర్వాంచల్ విద్యుత్ విత్రాన్ నిగమ్' డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు స్కూల్ కో-ఆర్డినేటర్ యోగేంద్ర మిశ్రా. అయినప్పటికీ సదరు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సెప్టెంబర్ 7లోగా బిల్లు కట్టకపోతే విద్యుత్ సరఫరా ఆపేస్తామని అధికారులు హెచ్చరించారని ఆవేదన వ్యక్తంచేశారు.
"గతంలోనూ పలుమార్లు కరెంటు బిల్లు తప్పుగా వచ్చింది. సరిచేశాక కట్టేవాడిని. ఈసారి బిల్లు ఉహించని మొత్తంలో వచ్చింది. రూ.600 కోట్లు దాటింది. అధికారులకు విషయం చెప్పాను. వారు సాఫ్ట్వేర్ సమస్య కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. త్వరగా పరిష్కరించాలని కోరాను. గత నెల నాలుగో తేదీన తప్పు సరిచేశాక కరెంట్ బిల్లు రూ.9వేలు వచ్చింది. వెళ్లి కట్టాను. 25 తేదీ తర్వాత మళ్లీ రెండోసారి రూ.కోట్లలో బిల్లు వచ్చింది. అధికారులను కలిసేందుకు రెండు సార్లు వెళ్లాను. ఎవరూ అందుబాటులో లేరు. "
- యోగేంద్ర మిశ్రా, పాఠశాల కోఆర్డినేటర్