స్వదేశానికి తిరిగి రావటం బాగుందని వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వ్యాఖ్యానించినట్లు ఓ వైమానిక అధికారి వెల్లడించారు. పైలట్ రాకపై ట్విట్టర్ వేదికగా వాయుసేన హర్షం వ్యక్తం చేసింది. గగన వీరుడిని చూసి భారత వాయుసేన గర్విస్తుందని తెలిపింది.
వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ మళ్లీ మనతో ఉన్నారు. ఈ సైనికుడి పట్ల భారత వాయుసేన గర్వంగా ఉంది. - ట్విట్టర్లో ఐఏఎఫ్
దాదాపు 3 రోజుల పాటు పాక్ చెరలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అభినందన్‌కు వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ తెలిపారు.
ఏం జరిగింది..?
పుల్వామా దాడిలో 40 మంది వీర జవాన్ల మృతికి కారణమైన 'జైషే మహ్మద్' తీవ్రవాద సంస్థ శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ చర్యకు పాక్ స్పందించింది. ఎఫ్-16 యుద్ధవిమానాలతో భారత సైనిక శిబిరాలపై దాడులకు యత్నించింది.
పాక్ యుద్ధవిమానాలను రాడార్‌ల ద్వారా ముందే గుర్తించిన భారత వాయుసేన ఎదురుదాడికి దిగింది. పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధవిమానాన్ని, మిగ్-21 యుద్ధవిమానంతో వింగ్ కమాండర్ అభినందన్ పేల్చేశారు. పాక్ దాడిలో అభినందన్ ఉన్న మిగ్ 21 విమానం కూలిపోయింది. కూలిపోతున్న సమయంలో అభినందన్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పారాషూట్ సాయంతో పాక్ భూభాగంలోకి దూకేశారు. అతడిని పట్టుకున్న పాక్ భారత్‌పై ఒత్తిడి పెంచే యత్నం చేసింది.