కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగిలింది. దశాబ్దాలుగా గాంధీ-నెహ్రూ కుటుంబానికి పట్టం కడుతూ వచ్చిన అమేఠీ ఓటర్లు.. ఈసారి కమలానికి జై కొట్టారు. మోదీ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న ప్రచారాన్ని విశ్వసించిన అమేఠీ ప్రజానీకం కాషాయానికి పట్టం కట్టారు. భాజపా అభ్యర్థిగా స్మృతి ఇరానీని గెలిపించి.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడికే ఊహించని తీర్పు చెప్పారు.
తరుచూ పర్యటనలతో..
రాహుల్ అందుబాటులో ఉండరని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన స్మృతి ఇరానీ... గత ఎన్నికల్లో ఓటమిపాలైనా తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానంటూ మద్దతు కూడగట్టారు. 2014 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేసిన ఆమె లక్ష ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అనంతరం కేబినెట్ మంత్రిగా పనిచేస్తూనే అమేఠీలో తరచూ పర్యటిస్తూ అక్కడి ప్రజల మనసులు గెలుచుకున్నారు.
కాంగ్రెస్‌పై వ్యతిరేకత...
దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న అమేఠీలో కాంగ్రెస్ ప్రభ నానాటికీ దిగజారడం స్మృతి విజయానికి తోడ్పడిందని చెప్పాలి. నియోజకవర్గ అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వాదన వ్యతిరేకతకు కారణమైంది. ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవటం, అధ్యక్షుడి హోదాలో ఇతర అంశాలకు ప్రాధాన్యమిస్తూ నియోజకవర్గాన్ని విస్మరించారనే భావన... అమేఠీ ప్రజల్లో నెలకొనడమే రాహుల్ ఓటమికి దారితీసింది.