లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండటానికి చాలా మంది విసుగు చెందుతున్నారు. మరికొందరు మాత్రం తమలోని ప్రతిభను బయటకు తీసేందుకు ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడంలో కొందరు నిమగ్నమైతే, మరి కొందరు ఇంటి అలంకరణ, మొక్కల పెంపకం, వ్యాయామం వంటి రకరకాల పనుల్లో నిమగ్నమవుతున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళా వ్యాపారి.. అరచేతిలో పట్టేలా రకరకాల ఆహార నమూనాలను సిద్ధం చేసేస్తోంది. వాటిని చూస్తే నిజంగా అరచేతిలో ఆహారం పట్టేసిందే అనిపిస్తోంది! ఇంతకీ వాటిని ఎలా చేస్తోందో చూసేద్దామా?
ఆరగించేయాలి అనిపించేలా..
లాక్‌డౌన్‌ను పాటిస్తూ అహ్మదాబాద్‌లో చాలా మంది తమ అభిరుచిని అనుసరిస్తున్నారు. తమకు నచ్చిన వంటకాలు చేస్తూ, రానివి నేర్చుకుంటూ, యోగా, ధ్యానం వంటి కార్యకలాపాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే నగరంలోని వ్యాపారవేత్త శ్వేతా షా మాత్రం లాక్డౌన్లో చిన్న సైజు ఆహార పదార్థాల నమూనాలను రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. వాటిని చూస్తే నిజమైన ఆహారమే అని భావించి ఆరగించేయాలి అనిపించడం ఖాయం.
ఒక్కో డిజైన్‌కు 30 నుంచి 45 నిమిషాలు
శ్వేతా షా ఈ సూక్ష్మ ఆహార పదార్థాల నమూనాల తయారీలో ఒక్కో ఆకృతిని తీర్చిదిద్దేందుకు 30 నుంచి 45 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇక రంగులు వేయడానికి మరో 15 నిమిషాలు పడుతుంది. ఆమె తయారు చేసే ప్రతి వస్తువు రెండున్నర అంగుళాల పరిమాణం లేదా రూపాయి నాణాల పరిమాణంలో ఉంటాయి.
ఎన్నో వెరైటీలు